iDreamPost

అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఎత్తివేత .. రాకపోకలకు ఏపీ గ్రీన్ సిగ్నల్

అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఎత్తివేత .. రాకపోకలకు ఏపీ గ్రీన్ సిగ్నల్

దాదాపు మూడు నెలల తర్వాత అంతర్రాష్ట్ర సరిహద్దులు తెరుచుకోబోతున్నాయి. కరోనా కట్టడికి విధించుకున్న అంక్షలు తొలగిపోనున్నాయి. రేపు సోమవారం నుంచి అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించింది. ఈ నెల 1వ తేదీ నుంచి ఐదో విడత లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి అంతర్రాష్ట్ర రావాణాకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వెలుసుబాటు ఆయా రాష్ట్రాలకు వదిలిపెట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ ఒకటి నుంచే సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఎత్తివేయగా ఏపీలో కొనసాగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఈ నెల మొదట్లో హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని ఏపీ పోలీసులు సరిహద్దుల వద్ద నిలిపివేశారు. సరిహద్దుల వద్ద భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. పాస్‌ ఉంటేగానీ అనుమతించబోమని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారిని తెలంగాణ పోలీసులు అనుమతించారు. ఈ క్రమంలో రేపటి నుంచి తిరుమలతోపాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు తెరుచుకోనుండడం, మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు రేపటి నుంచి అమలులోకి వస్తుండడంతో ఏపీ ప్రభుత్వం కూడా సరిహద్దు చెక్‌పోస్టులను ఎత్తివేస్తోంది. వాహనదారులు ఇక స్వేచ్ఛగా రేపటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి