iDreamPost

మళ్లీ జనాల్లోకి విస్తృతంగా ముఖ్యమంత్రి

మళ్లీ జనాల్లోకి విస్తృతంగా ముఖ్యమంత్రి

ఏపీ సీఎం రూటు మార్చారు. వరుస పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మునిసిపల్ ఎన్నికలు ముగిసిన మరునాడే ఆయన గుడివాడలో పర్యటించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేపు మళ్లీ మాచర్ల వెళ్లబోతున్నారు. స్వతంత్ర్యదినోత్సవ వేడుకల ప్రారంభోత్సవంలో భాగంగా మాచర్లలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వారసులను సన్మానించబోతున్నారు.

వాస్తవానికి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు, తర్వాత కూడా ప్రజల మధ్య ఉండేందుకు ప్రాధాన్యతనిచ్చారు. అయితే గత ఏడాది కాలంగా కరోనా మూలంగా పూర్తిగా క్యాంపు ఆఫీసుకే పరిమితమయ్యారు. వివిధ కార్యక్రమాలను ఆయన సీఎంవో నుంచే ప్రారంభించారు. అంతా ఆన్ లైన్ పద్ధతిలోనే కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో ఆయన కూడా అనివార్యంగా జాగ్రత్తలు పాటించారు.

అదే సమయంలో వరుసగా పంచాయతీ ఎన్నికలు, మునిసిపల్ ఎన్నికలు జరిగినా ఆయన వాటిలో జోక్యం చేసుకోవడానికి సిద్ధపడలేదు. స్థానిక ఎన్నికల బాద్యతలను స్థానిక నాయకత్వానికే అప్పగించారు. ఎక్కడిక్కడ మంత్రులు, పార్టీ ఇన్ఛార్జులు, ఎమ్మెల్యేల సారధ్యంలో ఎన్నికలకు సిద్ధం చేశారు. ఆశించిన పలితాలు రావడంతో అధికార పార్టీ ఉత్సాహంగా ఉంది. దానిని కొనసాగిస్తూ ప్రజల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సీఎం సిద్ధమవుతున్నారు.

త్వరలో రచ్చబండ వంటివి నిర్వహించాలని సంకల్పించారు. కరోనా ఉధృతి మరోసారి ప్రభావం చూపించకపోతే వచ్చే జూన్ నాటికి రెండేళ్ల పాలన ముగుస్తున్న సమయంలో రచ్చబండకు శ్రీకారం చుట్టాలని ఆశిస్తున్నారు. అంతేగాకుండా ఈనెలాఖరు వరకూ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న తరుణంలో ఏప్రిల్ నుంచి వివిధ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈసారి అభివృద్ధి కార్యక్రమాల సమీక్షలు కూడా జరిపే అవకాశం ఉంది. దాంతో ముఖ్యమంత్రి మళ్లీ ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండేందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో అధికార పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరగడం ఖాయంగా చెప్పవచ్చు.

Also Read : కోటప్పకొండ మహాశివరాత్రి.. ప్రభల సంస్కృతీ వైభవం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి