iDreamPost

ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించిన ధీరజ్‌ సింగ్‌..

ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించిన ధీరజ్‌ సింగ్‌..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ న‌జీర్ జ‌స్టిస్‌ ధీర‌జ్ సింగ్ ఠాకూర్‌తో ప్రమాణం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్‌ని శాలువ కప్పి.. సీఎం జగన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ  అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గురువారం రాత్రి అమరావతికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఆయన ప్రమాణం చేశారు.  జమ్మూకశ్మీర్ లో 1964  ఏప్రిల్ 25న జస్టిస్ ఠాకూర్ జన్మించారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ది న్యాయమూర్తుల కుటుంబమే. ఆయన తండ్రి, సోదరు కూడా న్యాయమూర్తులుగా పనిచేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తీర్ధసింగ్ ఠాకూర్ సోదరుడే జస్టిస్ ధీరజ్ సింగ్. ఇక ధీరజ్ సింగ్ తండ్రి జమ్ముకశ్మీర్ కు ఉపముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.

ధీరజ్ సింగ్ 1989 లో ఢిల్లీలో న్యాయవాది వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత ఆయన జమ్మూకాశ్మీర్ లో న్యాయవాదిగా పనిచేశారు. 2013 మార్చి 8న జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. న్యాయవర్గాల్లో వివాదరహితుడిగా జస్టిస్ ధీరజ్ సింగ్ కు  పేరుంది. ముంబై నుండి ఆయనను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించారు. హైకోర్టు ప్రధాన న్యామూర్తిగా ఆయన 2026 ఏప్రిల్ 24 వరకు ఉంటారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జమ్మూకశ్మీర్  నుంచి న్యాయమూర్తులెవ్వరూ లేరు. కాబట్టి లోగా ఆయనకు పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఏపీ మంత్రి అమర్నాథ్‌‌ను కలిసిన ముద్రగడ పద్మనాభం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి