iDreamPost

ఈనెల 7న క్యాబినెట్ భేటీ, కొత్త మంత్రివర్గంపై ఆరోజే క్లారిటీ!

ఈనెల 7న క్యాబినెట్ భేటీ, కొత్త మంత్రివర్గంపై ఆరోజే క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన ప్రక్రియ పూర్తయ్యింది. రేపటి నుంచి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కాబోతోంది. దానికి అనుగుణంగా కొత్త కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు ఆయా జిల్లా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి అంకం క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చుట్టూ అందరి దృష్టి పడింది. జగన్ చెప్పినట్టుగా తన ప్రభుత్వంలో మూడేళ్ల కాలంలోనే కొత్త జిల్లాలను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తన ఎలక్షన్ క్యాబినెట్ ఎంపిక మీద దృష్టి పెడుతున్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎంపిక ఉంటుందా అనే చర్చ కూడా సాగుతోంది. 26 జిల్లాలకు 24 బెర్తులు ఖాళీగా ఉండడంతో ఎవరిని కొనసాగిస్తారు, ఎవరికి కొత్తగా ఛాన్సిస్తారనే దాని చుట్టూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఏపీ మంత్రివర్గ విస్తరణకు ఇప్పటికే ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల 11న కొత్త క్యాబినెట్ కొలువు దీరుతుంది. తన టీమ్ లో జగన్ ఎవరెవరిని ఉంచుతారు, ఎవరికి కొత్తగా ఛాన్సిస్తారనే దాని చుట్టూ సాగుతున్న చర్చలో ఆసక్తికర అంశాలు తెరమీదకు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఈనెల 7న రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. జగన్ తొలి క్యాబినెట్ కి ఇదే చివరి భేటీ కాబోతోంది. దాంతో సీఎం వై.ఎస్.జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించబోతున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీఎల్పీ మీటింగులో జగన్ తన మనసులో మాటను బయటపెట్టారు. తాను తొలుత చెప్పినట్టుగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, అయితే రాజకీయ సమీకరణాల కారణంగా ఒకరిద్దరిని కొనసాగించాల్సి రావచ్చని వెల్లడించారు. దాంతో కనీసంగా ఇద్దరు మంత్రులను కొనసాగిస్తే వారెవరన్న దానిపై ఆసక్తి కనిపిస్తోంది.

సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలను కొనసాగిస్తారని కొన్ని కథనాలు వచ్చాయి. వారితో పాటుగా కొడాలి నాని, పేర్ని నాని, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం. శంకర నారాయణలకు కూడా కులాల ఈక్వేషన్స్ లో అవకాశం లేకపోలేదనే అంచనాలున్నాయి. వీరిలో ఎవరెవరుంటారన్నది దాదాపుగా 7న స్పష్టత రాబోతోంది. అదే సమయంలో ఈసారి క్యాబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేయబోతున్నట్టు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దాంతో రెడ్డి, కాపు కోటాలో కోత తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ తొలుత నలుగురు రెడ్లు, నలుగురు కాపులు,, ఒక కమ్మ, ఒక క్షత్రియ, ఒక వైశ్య కులస్తుల కి అవకాశం ఇచ్చారు. ఈసారి క్యాబినెట్ లో బ్రాహ్మణులకు ఛాన్స్ ఉంటుందనే ప్రచారం ఉంది. దాంతో పాటుగా బీసీలు ఒకరిద్దరు పెరిగే అవకాశం ఉంటుందనడంతో కాపు, రెడ్డి కోటాలో ఒకరొకరు చొప్పున తగ్గవచ్చనే అంచనాలున్నాయి.

ఈ విషయాలపై సీఎం తన ప్రస్తుత క్యాబినెట్ సహచరులతో మనసులోమాటను పంచుకునే అవకాశం ఉంది. 7న మంత్రివర్గ సమావేశం తర్వాత 8న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సీఎం జగన్ కలువనున్నారు. తన మంత్రివర్గ సహచరుల వివరాలు సమర్పించబోతున్నారు. ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని కోరబోతున్నారు. ఇప్పటికే నిర్ణయించినట్టుగా కొత్త కేబినెట్ ఈనెల 11న కొలువు దీరనుంది. అదే రోజు కొత్త మంత్రులు, పాత మంత్రులకు సీఎం విందు ఇవ్వనున్నారు. అయితే కొత్త మంత్రులుగా ఎవరెవరికి అవకాశం వచ్చిందనే విషయాన్ని అధికారికంగా ఒక్కరోజు ముందు మాత్రమే సమాచారం ఇవ్వబోతున్నారు. దాంతో ఆశావాహుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. పలువురు సీనియర్లతో పాటుగా కొత్తగా ఎన్నికయిన వారికి కూడా ఇప్పటికే అవకాశం ఇచ్చినందున అందరూ పోటీపడే పరిస్థితి కనిపిస్తోంది. జగన్ వ్యూహం ఎలా ఉంటుందన్నదాని చుట్టూ ఉత్కంఠ పెరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి