iDreamPost

ప్రోత్సాహకమే కాదు.. లాభాల్లో బోనస్‌ కూడా రైతులకే..

ప్రోత్సాహకమే కాదు.. లాభాల్లో బోనస్‌ కూడా రైతులకే..

సహకార రంగం ద్వారా పాడి పరిశ్రమను బలోపేతం చేయడం ద్వారా మహిళలకు ఆర్థిక స్థిరత్వం చేకూర్చేందుకు ఉద్దేశించిన అమూల్‌ కార్యకలాపాలను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్రంలో క్షీణించిన సహకార వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలో సహకార రంగం ద్వారా అమూల్‌ పాలను సేకరిస్తుంది. పాడి రైతులకు అమూల్‌ సంస్థే పది రోజులకు ఒకసారి నగదు చెల్లింపులు చేస్తుంది. ఈ ప్రాజెక్టును ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు.

తొలి దశలో చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో అమూల్‌ పాల సేకరణ ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాలను సేకరించేందుకు ప్రభుత్వం, అమూల్‌ ప్రణాళికలు రూపాందించాయి. వెయి లీటర్లు ఆపై పాల ఉత్పత్తి జరిగే గ్రామాల్లోనే బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గురించిన 9899 గ్రామాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆటోమేటిక్‌ పాల సేకరణ కేంద్రాలు(ఏఎంసీయూ)ల ద్వారా పాలను సేకరించనున్నారు.

ప్రైవేటు డైరీల కన్నా లీటర్‌కు 5 – 7 రూపాయలు ఎక్కువ ఆదాయం రైతులకు వస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు శాశ్వతంగా కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే 20 , 30 ఏళ్లలో సహచార వ్యవస్థ బలోపేతమై వందేళ్లపాటు సాగాలన్నదే తన లక్ష్యమని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. పాడి ద్వారా మహిళలకు నిరంతరం ఆదాయం రావాలన్నదే తన ఆశయమన్నారు. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల ద్వారా కావాల్సిన వారందరికీ ఆవులు, గేదెలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఆవులు, గేదెల కొనుగోలులో రైతులకు అమూల్‌ సహకారం అందిస్తుందని చెప్పారు. అమూల్‌ సంస్థకు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు వచ్చే బోనస్‌ కూడా పాడి రైతులకే అందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి