iDreamPost

విన్యాసాల జ్యోతి, కరోనా ప్రభావ జోన్స్ మీద వాస్త‌వాలు విస్మ‌రించిన రీతి

విన్యాసాల జ్యోతి, కరోనా ప్రభావ జోన్స్ మీద  వాస్త‌వాలు విస్మ‌రించిన రీతి

చంద్ర‌బాబు ఏం చేసినా స‌రైన‌దే, ఇత‌రులు చేసిన‌వ‌న్నీ చేత‌గానివే అనుకుంటే ఇలానే జ‌రుగుతుంది. మ‌న‌కు న‌చ్చిన వాళ్లు చేస్తేనే మంచి అయిన‌ట్టు, మ‌రోడు చేస్తే త‌ప్పు అయిన‌ట్టు చిత్రీక‌రించేందుకు సిద్ధ‌మ‌యితే అంత‌కుమించిన క‌థ‌నాలు ఉండ‌వు. అందుకే ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక క‌థ‌నాలు రానురాను అప‌హాస్యం అవుతున్నాయి. పాఠ‌కుల విశ్వాసాన్ని పొందాల్సింది పోయి ప‌రిహాసం అవుతున్నాయి.

గ‌డిచిన రెండు రోజులుగా ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక క‌థ‌నాలు చూస్తే ఆశ్చ‌ర్యం క‌లిగించ‌వు. ఎందుకంటే చంద్ర‌బాబు యూట‌ర్న్ లు చూసిన త‌ర్వాత ఆయ‌న న‌మ్మిన బంటు అంత‌కమించిన విన్యాసాలు వేస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌రు. అందుకే ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక క‌థ‌నాల్లో కప్ప‌దాట్లు అందుకు నిద‌ర్శ‌నం. ఏపీలో జ‌గ‌న్ ప్రభుత్వం ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించ‌డం బాబు అండ్ కోకి ఏమాత్రం రుచించ‌డం లేదు. చివ‌ర‌కు చూస్తుంటే క‌రోనా కంట్రోల్ లో ఉండ‌డం కూడా గిట్ట‌డం లేదేమో అనిపిస్తోంది.

వాలంటీర్లను ఉపయోగించి సేకరించిన డేటా స‌హాయంతో రెడ్,ఆరంజ్,గ్రీన్ అని మూడు జోన్లగా విభ‌జించి, లాక్ డౌన్ అమ‌లు విష‌యంలో కేంద్రం స‌మ‌గ్రంగా ఆలోచించాల‌ని నేరుగా ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పీఎం దృష్టికి తీసుకెళ్లారు సీఎం జ‌గ‌న్. దానికి త‌గ్గ‌ట్టుగా మూడు జోన్ల‌ను ఆయ‌న పీఎం ముందు ప్ర‌తిపాదించారు. ఇది దేశ‌మంతా తెలిసిన స‌త్యం. అయినా దానిని కూడా మ‌సిపూసి మారేడు కాయ చేయాల‌ని బాబు బ్యాచ్ శ‌తవిధాలా ప్ర‌య‌త్నిస్తోంది. స్వ‌యంగా చంద్రబాబు రంగంలో దిగేసి అంతా తానే చెప్పాన‌ని క‌ల‌రింగ్ ఇచ్చేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. బాబు క‌ష్టాన్ని వృద్ధా చేయ‌నివ్వ‌కుండా చూసేందుకు ఆంధ్ర‌జ్యోతి అవ‌స్థ‌లు ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

దానికి త‌గ్గ‌ట్టుగానే తొలినాడు జ‌గ‌న్ ఆశ‌ల‌కు గండి అన్న‌ట్టుగా, జోన్ల వారీ స‌డ‌లింపు ఆలోచ‌న చెల్ల‌లేద‌న్న‌ట్టుగా చిత్రీక‌రించేందుకు బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. జ‌గ‌న్ కి ఝ‌ల‌క్ అనే ఆ ప‌త్రిక రెగ్యుల‌ర్ హెడ్డింగ్ నే మ‌ళ్లీ వాడేశారు. కానీ తీరా చూస్తే మోడీ చేసిన ప్ర‌క‌ట‌న‌లో మే 3వ‌ర‌కూ లాక్ డౌన్ కొన‌సాగిన‌ప్ప‌టికీ ఏప్రిల్ 20 త‌ర్వాత ప‌రిస్థితిని బ‌ట్టి స‌డ‌లింపు చేస్తామ‌ని చెప్పిన మాట‌లు బాబు వ‌ర్గానికి మింగుడుప‌డిన‌ట్టు లేదు. అందుకు త‌గ్గ‌ట్టుగానే తొలుత చంద్ర‌బాబు మీడియా ముందుకు వ‌చ్చి అది త‌న ఆలోచ‌నే అని చెప్పుకోగా, ఇప్పుడు ఆంధ్ర‌జ్యోతి దానికి త‌గ్గ‌ట్టుగా స‌డ‌లింపు వ‌స్తుంద‌నే సంకేతాలు ఇచ్చేస్తోంది. కరోనా కేసులు లేని శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలలో,తెలంగాణలోని ఐదు జిల్లాలలో లాక్ డౌన్ ఎత్తివేయొచ్చని ఈ రోజు వార్త రాసింది. నిన్నటి ప‌త్రిక‌లో జ‌గ‌న్ కి ఝ‌ల‌క్ ఇస్తే, ఈరోజు ప‌త్రిక‌లో స‌డ‌లింపున‌కు ఎలా సై అన్నార‌నే విష‌యం కూడా వాళ్ల‌కు ప‌ట్ట‌దు. అంత ప‌చ్చిగా తాము రాసిందానికి తామే భిన్నంగా మాట్లాడ‌డం, అది కూడా త‌మ ఘ‌న‌తే అని చెప్పుకోవ‌డం ఆ వ‌ర్గీయుల‌కే చెల్లిందేమో అన్న‌ట్టుగా సందేహాలు క‌లిగించే స్థాయిలో వారి తీరు ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి