iDreamPost

భీమవరం చేరుకున్న అల్లూరి భారీ కాంస్య విగ్రహం.. జులై4న ప్రధాని చేతులమీదుగా ఆవిష్కరణ

భీమవరం చేరుకున్న అల్లూరి భారీ కాంస్య విగ్రహం.. జులై4న ప్రధాని చేతులమీదుగా ఆవిష్కరణ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విప్లవవీరుడైన అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా జులై 4వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ఆవిష్కృతం కానున్న అల్లూరి సీతారామరాజు 30 అడుగుల భారీ కాంస్య విగ్రహం పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చేరుకుంది. 34వ వార్డు ఏఎస్ఆర్ నగర్ లోని మున్సిపల్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.3 కోట్ల వ్యయంతో 15 టన్నుల బరువైన అల్లూరి కాంస్య విగ్రహాన్ని పాలకొల్లుమండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని ఎత్తైన కాంక్రీట్ దిమ్మెపై నిలబెట్టారు. విగ్రహ ఆవిష్కరణకు సమయం దగ్గరపడటంతో.. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో పార్కును అందంగా తీర్చిదిద్దుతున్నారు.

జులై 4వ తేదీన ప్రధాని మోదీ భీమవరంలో పర్యటించనున్న నేపథ్యంలో ఎస్ పీజీ ఏఐజీ హిమాన్షు గుప్త, కేంద్ర కల్చరల్ డైరెక్టర్ అతుల్ మిశ్రా, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్ హెలీప్యాడ్, బహిరంగ సభ స్థలాలను మంగళవారం పరిశీలించారు. పీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు హిమాన్షు గుప్త తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి