iDreamPost

ఫిలింఫేర్ మొత్తం పుష్ప మయం

ఫిలింఫేర్ మొత్తం పుష్ప మయం

నిన్న బెంగళూరు వేదికగా జరిగిన ఫిలిం ఫేర్ సౌత్ అవార్డుల వేడుక తారాతోరణంతో కళకళలాడింది. తెలుగు తమిళ కన్నడ మలయాళం నుంచి వచ్చిన సెలబ్రిటీలను చూసేందుకు లైవ్ ఆడియన్స్ కి రెండు కళ్ళు చాలలేదు. టాలీవుడ్ కు సంబంధించి మొత్తం డామినేషన్ పుష్ప పార్ట్ 1 ది రైజ్ దే సాగింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ చిత్రం కింద ఇలా అన్ని విభాగాలు పుష్పకే వెళ్లాయి. క్రిటిక్స్ క్యాటగిరీలో బెస్ట్ యాక్టర్ గా శ్యామ్ సింగ రాయ్ కు గాను నాని గుర్తింపు పొందగా అదే చిత్రంలో అద్భుతంగా నటించిన సాయిపల్లవికి సైతం పురస్కారం అందింది.

మొత్తంగా పుష్ప ఏకఛత్రాధిపత్యం చెలాయించేసింది. ఇదే మైత్రి సంస్థ నిర్మించిన ఉప్పెనకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా బుచ్చిబాబుతో పాటు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు అవార్డు కొట్టేశారు. ఏడాది మొత్తంలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండకు ఒక్కటంటే ఒక్కటి రాకపోవడం పట్ల నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య నటన, తమన్ నేపధ్య సంగీతం, హై స్టాండర్డ్ లో సాగిన ఛాయాగ్రహణం, ఎందరో ఆర్టిస్టుల బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవేవి కనిపించలేదాని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఫిలిం ఫేర్ కమిటీ పరిగణనలోకి తీసుకునే అంశాలు, ఎంపిక ఎలా జరుగుతుందనే దాని గురించి బయటికి తెలియదు కాబట్టి లోగుట్టు పెరుమాళ్ళకెరుక

తెలుగు కంటే ఎక్కువ హిందీలో అనూహ్య విజయం సొంతం చేసుకున్న పుష్పకి ఈ స్థాయి గుర్తింపు రావడం విశేషమే. ఇంకా సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. ఈ నెల నుంచే అన్నారు కానీ ప్రస్తుతానికి ఆ సూచనలు లేవు. అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవం రోజే స్టార్ట్ చేస్తారనే టాక్ వచ్చింది కానీ ఎందుకో మళ్ళీ వాయిదా వేసినట్టు కనిపించింది. బడ్జెట్ ని రెట్టింపు చేయడంతో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2లో నిర్మించబోతున్నారు. మూడు వందల కోట్లనే లీక్ వచ్చింది కానీ అదెంత వరకు నిజమో నిర్ధారణగా చెప్పలేం. ఇదయ్యాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత చేయబోయే సినిమా ఏదో ఇంకా సస్పెన్స్ గానే ఉంది. త్రివిక్రమని టాక్. చూద్దాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి