iDreamPost

లాక్ డౌన్ పొడిగింపు బాటలో రాష్ట్రాలు.. లాక్ డౌన్ ను పొడిగించిన మరో రాష్ట్రం

లాక్ డౌన్ పొడిగింపు బాటలో రాష్ట్రాలు.. లాక్ డౌన్ ను పొడిగించిన మరో రాష్ట్రం

ఈ నెల 14వ తేదీతో కేంద్రం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడువు ముగుస్తుండగా కరోనా వైరస్ మాత్రం నియంత్రణ లోకి రాలేదు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించాలన్న సూచనలు, డిమాండ్లు కేంద్రానికి వెళుతున్నాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నేతలతో ఓ వైపు సమాలోచనలు జరుపుతుండగా.. మరో వైపు బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు తమ పరిధిలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నాయి.

ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న బుధవారం సీఎం అమరిందర్ సింగ్ ఈ మేరకు ప్రకటించారు. పంజాబ్ బాటలోనే ఈ రోజు మరో రాష్ట్రం నడిచింది. ఒడిశా రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు. అంతే కాకుండా విద్య రంగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 17 వరకు ప్రభుత్వ, ప్రయివేటు విద్య సంస్థలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా వైరస్ నియంత్రణ లోకి రాకపోవడం తో లాక్ డౌన్ పొడిగించాలన్న ఆలోచనలు కేంద్రం చేస్తోంది. ఈ నెల 11 వ తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. వైరస్ కట్టడి చర్యలు, లాక్ డౌన్ పై సీఎంల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత లాక్ డౌన్ పొడిగింపు పై ప్రకటన చేస్తారని ప్రచారం సాగుతోంది. ఈ లోపు బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల లో కూడా ఈ నెల 30వ తేదీ లాక్ డౌన్ పొడిగింపు ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి