iDreamPost

అది అఖిల పక్షం కాదు.. టిడిపి పక్షం

అది అఖిల పక్షం కాదు.. టిడిపి పక్షం

అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌ని ఐకాసా పిలుపుమేర‌కు త‌ల‌పెట్టిన బ‌స్ యాత్ర క‌ర్నూలు జిల్లాకు చేరుకోలేదు. అయితే ముందుగా నిర్ణ‌యించిన మేర‌కు అఖిల‌ప‌క్ష స‌మావేశం మాత్రం క‌ర్నూలులో జ‌రిగింది. ఇందులో టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి టిజి భరత్, కోడుమూరు ఇంచార్జి విష్ణువర్ధన్ రెడ్డి, మంత్రాలయం ఇంచార్జి తిక్కా రెడ్డి, ఆదోని ఇంచార్జి మీనాక్షి నాయుడు, ఎమ్మెల్సీలు కే. ఈ ప్రభాకర్, బి టి నాయుడు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు ఇంచార్జి బి.వి జయనాగేశ్వర రెడ్డి, ఆలూరు ఇంచార్జి కోట్ల సుజాతమ్మ, పత్తికొండ ఇంచార్జి కే. ఈ శ్యామ్ హాజరుకాలేదు.

ఈ స‌మావేశంలో తెలుగుదేశం పార్టీతో పాటు ఇత‌ర పార్టీలు, ప్ర‌జా సంఘాలు పాల్గొన్నాయి. అయితే స‌మావేశం ప్రారంభంలోనే నేత‌లు ఎవ‌రెవ‌రు ఎలా మాట్లాడాలి అన్న దానిపై ప‌లు సూచ‌న‌లు చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. స‌మావేశంలో మాట్లాడాల‌నుకొనే వారు కేవ‌లం అమ‌రావ‌తిలో రాజ‌ధాని ఉండాలి అన్న విష‌యం గురించి మాత్ర‌మే చెప్పాల‌ని నేత‌లు స‌మావేశానికి వ‌చ్చిన వారికి చెప్పారు. త‌మ ప్రాంతాల‌లో రాజ‌ధాని పెట్టాలని మాట్లాడ‌కూడ‌ద‌ని చెప్పారు. అయితే ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అఖిల‌ప‌క్ష స‌మావేశంలో పాల్గొనాల‌ని వచ్చిన నేత‌లు, ఇత‌ర ప‌బ్లిక్ ఈ మాట‌లు విన‌గానే అవాక్క‌య్యారు.

త‌మ ప్రాంతంలో రాజ‌ధాని ఉండాల‌ని కోరుకుని.. స‌మావేశంలో త‌మ గొంతుక‌ను వినిపించేందుకు వ‌స్తే ముందుగానే ఎలా మాట్లాడాలో చెప్పడం ఏంట‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇక అఖిల‌ప‌క్ష సమావేశం చంద్ర‌బాబును పొగ‌డ‌టం, సీఎం జ‌గ‌న్‌ను తిట్ట‌డంతోనే స‌రిపోయింది. ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీలు విశాఖ‌నే రాజ‌ధానిగా పెట్టాల‌ని నిర్ణ‌యిస్తే… స‌మావేశంలో పాల్గొన్న కొంద‌రు తుఫాన్ల ప్రాంతం విశాఖ వ‌ద్ద‌ని చెప్పారు. మ‌రికొంద‌రు పెడితే రాయ‌ల‌సీమ‌, క‌ర్నూలు ప్రాంతంలో రాజ‌ధానిని పెట్టాల‌ని చెప్పారు.

ఇలా నేత‌లు మాట్లాడుతున్న స‌మ‌యంలో వెంట‌నే తెలుగుదేశం పార్టీ నేత‌లు జోక్యం చేసుకొని కేవ‌లం అమ‌రావ‌తిలో రాజ‌ధాని ఉండాలి అన్న విష‌యం మాత్ర‌మే ప్ర‌స్తావించాల‌ని చెప్పారు. స‌మావేశంలో నేత‌ల ప్ర‌సంగాల త‌ర్వాత ఇలాగే మ‌ధ్య మ‌ధ్య‌లో టిడిపి నేతలు క‌లుగ‌జేసుకొని ఆచితూచి మాట్లాడాల‌న్న‌ట్లు సూచ‌న‌లు ఇవ్వ‌డంతో ఇది అఖిల పక్షమా లేక టిడిపి పక్షమా అన్న సందేహం అక్కడున్న వారిలో కలిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి