iDreamPost

Etharkum Thuninthavan : కోల్పోయిన వైభవాన్ని ఈటి(ET)నే తేవాలి

Etharkum Thuninthavan : కోల్పోయిన వైభవాన్ని ఈటి(ET)నే తేవాలి

ఒకప్పుడు గజినీ లాంటి బ్లాక్ బస్టర్ దెబ్బకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న సూర్యకు ఇప్పుడది ఏ స్థాయిలో దిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస డిజాస్టర్లు తన బిజినెస్ మీద తీవ్ర ప్రభావం చూపించాయి. తమిళంలో బాగానే నెట్టుకొస్తున్నప్పటికీ తను చాలా కీలకంగా భావించే తెలుగులో ఇలా జరగడం అభిమానులకు మింగుడు పడటం లేదు. సూర్య కొత్త సినిమా ఎత్తార్కుం తునివందాన్ (ఈటి) విడుదలకు సిద్ధంగా ఉంది. ముందు ఫిబ్రవరి 4 అన్నారు కానీ కరోనా ఆంక్షల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మూడో వారం లేదా నాలుగో వారం దిశగా ప్లానింగ్ జరుగుతోంది. అయితే నిర్మాతలకు టాలీవుడ్ నుంచి పెద్దగా ఆఫర్లు రావడం లేదట.

తెలుగు రాష్ట్రాలకు కేవలం అయిదారు కోట్ల దగ్గర డిస్ట్రిబ్యూటర్లు ఆగిపోయారని సమాచారం. ఇది తక్కువ మొత్తం. సూర్య గత చిత్రాలు ఆకాశం నీ హద్దురా, జైభీమ్ లను మనవాళ్ళు గొప్పగా ప్రశంసించి చూసినప్పటికీ అవి ఓటిటిలో వచ్చిన డిఫరెంట్ జానర్ మూవీస్. మాస్ అంశాలు ఉన్నవి కాదు. కేవలం వాటికొచ్చిన స్పందన చూసి ఎగ్జిబిటర్లు ఎగబడేంత సీన్ లేదు. సూర్య గతంలో తెచ్చిన థియేట్రికల్ రెవిన్యూలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అలా చూసుకుంటే బందోబస్త్, NGK మన దగ్గర ఎంత దారుణంగా ఆడాయో ఎవరూ మర్చిపోలేదు. అంతకు ముందు వచ్చిన గ్యాంగ్, రాక్షసుడు లాంటి ఫలితాలు కూడా యావరేజే.

ఇప్పుడా ప్రభావమంతా ఈటి మీద పడుతోంది. కనీసం తెలుగుకు కొత్త టైటిల్ అయినా ఆలోచించకుండా ఈటి అని పెట్టడం బట్టి చూస్తేనే అర్థమవుతోంది వాళ్లకు ఇక్కడి బాష మీదున్న అభిమానం. సరే దీని సంగతలా ఉంచితే దర్శకుడు పాండి రాజ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సెంటిమెంట్ మాస్ యాక్షన్ ని పండించడంలో దిట్ట. కార్తీ చినబాబు డైరెక్టర్ ఈయనే. అంతకు ముందు కూడా ఇలాంటి కథలే ఎక్కువ తెరకెక్కించాడు. ఈటి కూడా అదే ఫ్లేవర్ లో కనిపిస్తోంది. ఇదైనా సూర్యకు తెలుగులో తగ్గిన మార్కెట్ ని పెంచుతుందో లేదో చూడాలి. సూర్యనే కాదు ఇటీవలి కాలంలో తమిళ హీరోల డబ్బింగ్ బిజినెస్ బాగా తగ్గిపోయిన మాట వాస్తవం

Also Read : Box Office : బాక్సాఫీస్ ఎదురుచూపులు ఎప్పటిదాకా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి