iDreamPost

తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం

తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప  ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమయ్యింది. ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ నిర్వహించబోతున్నారు. కోవిడ్ నేపథ్యంలో అదనపు జాగ్రత్తలు కూడా పాటిస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి చక్రధర్ బాబు ప్రకటించారు. కౌంటింగ్ లోకి రావాలనుకుంటున్న అభ్యర్థులు, ఏజెంట్లు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించాలని ఇప్పటికే ఆదేశించారు.

నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను నెల్లూరు నగరంలోని డీకే డబ్ల్యూ కాలేజీలో లెక్కిస్తారు. చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో లెక్కింపు జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే మైక్రో అబ్జర్వర్లు, సూపర్ వైజర్లు, కౌంటింగ్ సిబ్బందికి తర్ఫీదు కూడా ఇచ్చారు.

ఆదివారం ఉదయం 8గం.లకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తొలుత సర్వీసు ఓట్లు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అత్యధికంగా తిరుపతికి సంబంధించి 25 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. సూళ్ళూరుపేట 24 రౌండ్లలో లెక్కిస్తారు. రెండు కౌంటింగ్ కేంద్రాల నుంచి సమాచారం నెల్లూరులోని ఆర్వో కార్యాలయానికి చేరుతుంది. అక్కడి నుంచే అధికారికంగా ఓట్ల లెక్కింపు వివరాలు విడుదల చేస్తారు. ఈవీఎం పద్ధతిలో జరిగిన ఎన్నికలు కావడంతో మధ్యాహ్నానానికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నెగిటివ్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి..

కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, కౌంటింగ్ విధులకు హాజరయ్యే జర్నలిస్టులు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకుని నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆర్వో ఆదేశించారు. 48గంటల్లోగా పరీక్షలు చేయించుకుని వాటిని సమర్పించాల్సి ఉంటుంది. అంతేగాకుండా కోవిడ్ నియంత్రణలో భాగంగా పేస్ షీల్డ్, మాస్కులు, గ్లౌజులు ఇతర జాగ్రత్తలన్నీ పాటించాలని సూచించారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా పూర్తి జాగ్రత్తలు పాటించాలని ఆర్వో సూచించారు.

విజయోత్సవాలు నిషిద్ధం

కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విజయోత్సవాలకు అనుమతి లేదని ఆర్వో, నెల్లూరు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. ఈనెల 4వ తేదీ వరకూ ఎన్నికల షెడ్యూల్ అమలులో ఉంటుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 11లక్షల ఓట్లు సుమారుగా పోల్ కాగా ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం 65 శాతం అంటే దాదాపుగా 7లక్షల ఓట్లు అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థికి దక్కే అవకాశం ఉంది. టీడీపీకి 23 శాతం, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థికి 7 శాతం లోప ఓట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది.

Also Read : రేపే కౌంటింగ్ .. ఐదు రాష్ట్రాల ప్రజా తీర్పు ఎలా ఉందబోతోంది..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి