iDreamPost

ఏజెంట్ వివాదం! వీడియో బైట్ రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్!

  • Author ajaykrishna Updated - 11:59 AM, Wed - 9 August 23
  • Author ajaykrishna Updated - 11:59 AM, Wed - 9 August 23
ఏజెంట్ వివాదం! వీడియో బైట్ రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్!

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కి.. ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన సినిమా ఏజెంట్. భారీ యాక్షన్ మూవీగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ఈ సినిమా.. ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. అఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఏజెంట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తో కమర్షియల్ గా నిరాశపరిచినట్లు ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. కాగా.. ఈ సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత.. సినిమాకు సంబంధించి ఓ వివాదం చర్చనీయంశంగా మారింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు వరకు వెళ్లినట్లు సదరు డిస్ట్రిబ్యూటర్ ఓ వీడియో బైట్ రిలీజ్ చేశారు. మరి అసలు ఏజెంట్ వివాదం ఏంటనే వివరాల్లోకి వెళ్తే..

ఏజెంట్ సినిమాకు సంబంధించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను.. వైజాగ్ కి చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ సతీష్(వైజాగ్ సతీష్) కొన్నారట. దాదాపు రూ. 30 కోట్లకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక హక్కులను కొనుగోలు చేశారట. సినిమా హక్కులు కొన్నట్లు.. ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకరతో ఒప్పందం కుదుర్చుకొని.. సినిమా రిలీజ్ ముందే రూ. 30 కోట్లు బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేశారట. అయితే.. తీరా సినిమా రిలీజ్ టైమ్ కి నిర్మాతలు మూడు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ కాకుండా.. కేవలం వైజాగ్ వరకే తనకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చారని.. అలాగే తాను ముందే చెల్లించిన అమౌంట్ కూడా చెప్పిన టైమ్ కి రిటర్న్ చేయకుండా మోసం చేశారని.. ఏజెంట్ నిర్మాతలపై కేసు పెట్టినట్లు వైజాగ్ సతీష్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో వైజాగ్ సతీష్ తరపున న్యాయవాది మాట్లాడుతూ.. “ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని రూ. 30 కోట్లకు తన క్లయింట్ సతీష్ తో నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకొని రిలీజ్ టైమ్ కి కేవలం వైజాగ్ ఒక్కటే ఇచ్చినట్లు తెలిపారు. అలాగే సినిమా విడుదలైన 45 రోజులలో సతీష్ అమౌంట్ రిటర్న్ చేస్తామని.. లేదా నెక్స్ట్ మూవీ రిలీజ్ కి 15 రోజుల ముందు మనీ ట్రాన్స్ ఫర్ చేస్తామని ఓ లెటర్ ద్వారా ఒప్పందం చేసుకున్నారు. కానీ.. ఏజెంట్ సినిమా విడుదలైన తర్వాత అమౌంట్ రిటర్న్ చేయలేదు.. వారు నిర్మించిన కొత్త సినిమా భోళా శంకర్ రిలీజ్ కి 15 రోజుల ముందు కూడా సతీష్ కి అమౌంట్ పంపలేదు. అందుకే వారిపై క్రిమినల్ కేసు పెట్టి.. కోర్టును ఆశ్రయించడం జరిగింది. సతీష్ అమౌంట్ రిటర్న్ చేసేదాకా సినిమా రిలీజ్ స్టే చేయాలని కోర్టులో పిటిషన్ వేసాము. దీనిపై కోర్టు ఈరోజు పరిష్కారం చేయనుంది. కోర్టు వారి నిర్ణయం బట్టి.. సతీష్ కట్టుబడి ఉంటాడు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏజెంట్ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి