iDreamPost

ఏజెంట్ అంత రిస్క్ చేస్తాడా?

ఏజెంట్ అంత రిస్క్ చేస్తాడా?

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అఖిల్ కొత్త సినిమా ఏజెంట్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. డేట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ ఇన్ సైడ్ ప్రకారం ఏప్రిల్ 14 రిలీజ్ కోసం ప్లానింగ్ జరుగుతోందట. జనవరి 1 నూతన సంవత్సర కానుకగా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలిసింది. ఏజెంట్ నిర్మాణంలో ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగింది. సైరా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. బడ్జెట్ కూడా అఖిల్ మార్కెట్ ని రెండింతలు అయ్యింది కానీ ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి బాగా వర్కౌట్ అవుతుందనే ధీమాతో నిర్మాత అనిల్ సుంకర ఉన్నారు. ఇక్కడే రిస్కులు లేకపోలేదు

ఏప్రిల్ లో చాలా సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. రవితేజ రావణాసుర ఏప్రిల్ 7 ఆల్రెడీ అఫీషియల్ గా లాక్ చేసుకుంది. ఇది డ్రాప్ అయ్యే ఛాన్స్ లేదు. ఆపై వారం ఇదే 14కి చిరంజీవి భోళా శంకర్ ఎప్పుడో కర్చీఫ్ వేశాడు. అయితే దీనికి ఏజెంట్ కి నిర్మాత ఒకరే కాబట్టి మెగాస్టార్ మూవీని పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ లేకపోలేదు. కానీ రజనీకాంత్ జైలర్ ని ఆ తేదీకే వేయాలని తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది. లారెన్స్ రుద్రుడు అదే రోజు సై అంటున్నారు. ఇతను తెరమీద కనపడి చాలా కాలమయ్యింది. లాక్ డౌన్ టైంలో పూర్తిగా మాయమైపోయాడు. చంద్రముఖి 2 కన్నా ముందు ఇది విడుదల కావాలి కాబట్టి ఆ మేరకు ప్లానింగ్ జరిగింది

మూడో వారంలో 21న సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష వస్తుంది. టీజర్ వచ్చాక ఇందులో కంటెంట్ మీద ఆసక్తి పెరిగింది. సేమ్ డే సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో వెంకటేష్ పూజా హెగ్డేలు ఉండటంతో తెలుగు వెర్షన్ ని కూడా భారీగా మార్కెటింగ్ చేస్తారు. ఇది గడిచిన వారానికి మణిరత్నం విజువల్ గ్రాండియార్ పొన్నియన్ సెల్వన్ 2 ఉంటుంది. తమిళం కాకుండా ఇతర భాషల్లో దీని మీద మరీ విపరీత అంచనాలు లేవు కానీ అసలు కథ రెండో భాగంలోనే ఉంటుందన్న ప్రచారం ఏ మేరకు మేలు చేస్తుందో చూడాలి. మరి ఇంత టైట్ షెడ్యూల్స్ మధ్య ఏజెంట్ నిజంగా రిస్క్ చేస్తాడా లేదా రెండు రోజుల్లో తేలనుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి