iDreamPost

ముందున్న వారికి కన్నా.. వెనకొచ్చిన వారే మిన్న..

ముందున్న వారికి కన్నా.. వెనకొచ్చిన వారే మిన్న..

ముందొచ్చిన చెవుల కన్నా.. వెనుకొచ్చిన కొమ్ములు వాడీ అన్నట్లుగా.. బిహర్‌ శాసన సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఏళ్ల తరబడి రాజకీయాలు చేస్తున్న పార్టీల కన్నా కొత్తగా వెళ్లిన ఎంఐఎం పార్టీ తన సత్తాను చాటింది. 243 అసెంబ్లీ సీట్లు గల బిహార్‌లో ఐదు సీట్లు గెలుచుకుని ఐదవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అమౌర్, కొచాధమన్, జోకిహాట్, బైసీ, బహుదుర్‌గంజ్‌ నియోజకవర్గాల్లో ఎంఐఎం విజయం సాధించింది.

2015 ఎన్నికల్లో బిహార్‌లో తొలిసారి ఎంఐఎం పోటీకి సిద్ధమైంది. ఆరు నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అయితే ఓట్లు, సీట్లు పరంగా నిరాశే ఎదురైంది. కేవలం 0.2 శాతం ఓట్లకే అప్పుడు పరిమితమైంది. ఈ సారి పక్కా వ్యూహంతో ఎంఐఎం బరిలోకి దిగింది. ఎన్నికలకు ముందే ఆ పార్టీ అధినేత అసద్దున్‌ ఓవైసీ రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే సిమాంచల్‌ ప్రాంతంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. 26 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపారు. ప్రధాన పార్టీలు, బిహార్‌లో ఏళ్ల తరబడి రాజకీయాలు చేస్తున్న కమ్యూనిస్టులు అంతా కలసి రెండు కూటములుగా పోటీ చేసినా.. ఎంఐఎం ఒంటరిగానే ఎన్నికల రంగంలో దిగింది. ఐదు నియోజకవర్గాల్లో పాగా వేసి మరో పెద్ద రాష్ట్రంలో పాగా వేసింది.

ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, ఎల్‌జేపీ వంటి పార్టీలు సాధించలేని విజయాన్ని ఎంఐఎం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. సీపీఎం, సీపీఐలు రెండు సీట్ల చొప్పున గెలవగా.. ఎల్‌జేపీ ఒక సీటుకే పరిమితమైన చోట.. ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలవడం విశేషం. తెలంగాణలోని హైదరాబాద్‌ పాతబస్తికే పరిమితమైన పార్టీగా గుర్తింపు ఉన్న ఎంఐఎం.. ఆ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నాలను ఎప్పటి నుంచో చేస్తోంది. అయితే పలు రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించినా.. శాసన, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే 2014 తర్వాత పరిస్థితి మారిపోయింది. మహారాష్ట్ర శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరిచింది. తాజా బిహార్‌లోనూ సత్తా చాటింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి