iDreamPost

కేజ్రీవాల్ నామినేషన్ లో నాటకీయ పరిణామం

కేజ్రీవాల్ నామినేషన్ లో నాటకీయ పరిణామం

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ న్యూ ఢిల్లీ అభ్యర్థి అరవింద్‌ కేజ్రీవాల్‌ నామినేషన్ దాఖలు లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం మధ్యాహ్నం కేజ్రీవాల్‌ కుటుంబ సభ్యులతో కలిసి జామ్‌నగర్‌ హౌస్‌ ఎన్నికల కార్యాలయానికి వచ్చారు. తాము నామినేషన్‌ పత్రాలు ఇచ్చేదాకా ఆయన్ను వెళ్లనిచ్చేది లేదని అప్పటికే భారీ సంఖ్యలో అక్కడున్న అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో నిబంధనల ప్రకారం కేజ్రీవాల్‌ టోకెన్‌ తీసుకున్నారు.

ఆయన టోకెన్‌ నంబర్‌..45. మధ్యాహ్నం మూడు గంటల్లోగా వచ్చిన వారికి టోకెన్‌ ఇచ్చి, నామినేషన్‌ పత్రాలను నింపేందుకు అధికారులు ఒకొక్కరికి గంట వరకు సమయం ఇచ్చారు. దీంతో సీఎం వంతు వచ్చేసరికి సాయంత్రం 6.30 గంటలయింది. దాదాపు 6 గంటల పాటు కేజ్రీవాల్ ఎదురు చూశారు. అప్పటి వరకు ఆయన మిగతా వారితో కలిసి కూర్చున్నారు. మంగళవారం ఒక్క రోజే 60 మంది వరకు నామినేషన్లు వేశారు.

కాగా, ఇదంతా బీజేపీ కుట్రేనని, బలపరిచేందుకు కనీసం 10 మంది కూడా లేని వారితో కావాలనే నామినేషన్లు వేయించిందని ఆప్‌ ఆరోపించింది. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడంపై కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. కేజ్రీవాల్‌ ప్రత్యర్థులుగా బీజేపీ సునీల్‌ యాదవ్‌ను, కాంగ్రెస్‌ రమేశ్‌ సభర్వాల్‌ను పోటీకి నిలిపాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి