iDreamPost

అటు సీఎస్‌.. ఇటు సీజే.. ఏపీలో ఒకే రెండు కీలక పరిణామాలు..

అటు సీఎస్‌.. ఇటు సీజే.. ఏపీలో ఒకే రెండు కీలక పరిణామాలు..

ఏడాది ముగింపు రోజు. నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు ఏపీలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థకు, న్యాయశాఖకు కొత్త అధిపతులు వచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అధిత్యానాథ్‌దాస్‌ కొద్దిసేపటి క్రితం బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని సీఎస్‌ ఛాంబర్‌లో ఆయన నీలం సాహ్ని నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ రోజుతో నీలం సాహ్ని పదవీ కాలం పూర్తవుతోంది. ఇప్పటికే ఆమె పదవీ కాలాన్ని ఒకసారి పొడిగించారు.

అధిత్యానాథ్‌ దాస్‌ ఇప్పటి వరకూ జలవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆధిత్యానాథ్‌ దాస్‌ మాట్లాడారు. తనకంటూ ప్రత్యేక ప్రాధాన్యతలు లేవని, ప్రభుత్వ ప్రాధాన్యతలే తన ప్రాధాన్యతలని పేర్కొన్నారు. ఆర్థికపరమైన క్లిష్ట పరిస్థితులున్న ప్రతి అంశానికి పరిష్కారం ఉంటుందన్నారు. సమస్యలు పరిష్కరించడమే అధికారులుగా తమ బాధ్యతని అధిత్యానాథ్‌ దాస్‌ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో తన భాగస్వామ్యం కూడా ఉంటుందన్నారు.

మరో వైపు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అరూప్‌ గోస్వామిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న అరూప్‌ గోస్వామి ఇటీవల జరిగిన బదిలీల్లో ఏపీకి వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న జేకే మహేశ్వరి సిక్కింకు బదిలీ అయ్యారు. దేశ వ్యాప్తంగా
తొమ్మిది హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రిం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయశాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.

అస్సాంకి చెందిన అరూప్‌ గోస్వామి 1985లో ఈశాన్య రాష్ట్రాలలో న్యాయవాదిగా పని చేయడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల ప్రాక్టీసు తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. సిక్కిం ప్రధాన న్యాయమూర్తిగా పని చేసే ముందు కొన్నాళ్లు గువాహటి హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్‌ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు చైర్మన్‌గా పని చేశారు. 2016 నుంచి 2019 వరకూ అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌గా పని చేశారు. న్యాయకోవిధుడైన గోస్వామి రంజీ స్థాయి క్రికెటర్‌. అస్సాం తరఫున ఆయన రంజీట్రోఫీలో ఆడారు. ఆయన ఎప్పుడు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడతారో తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి