iDreamPost

పితాని వర్సెస్ ఏసీబీ.. దొంగ – పోలీస్‌ ఆట..!

పితాని వర్సెస్ ఏసీబీ..  దొంగ – పోలీస్‌ ఆట..!

ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న 150 కోట్ల రూపాయల విలువైన ఈఎస్‌ఐ స్కాంలో ప్రస్తుతం దొంగ పోలీస్‌ ఆట నడుస్తోంది. పక్కా ఆధారాలతో ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ మాజీ మంత్రి అచ్చెం నాయుడు సహా పలువురు మాజీ, తాజా అధికారులను అరెస్ట్‌ చేసి జైలుకు పంపింది. ఇప్పుడు రెండో దఫా వేట మొదలుపెట్టింది. ఈ కేసులో కీలక పాత్ర అని ఏసీబీ నిర్థారించుకున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట సురేష్, ఆయన మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురళీలపై దృష్టి సారించింది. నిన్న శుక్రవారం పితాని మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురళీని ఏపీ సచివాలయంలో అరెస్ట్‌ చేయగా.. పితాని కుమారుడు తప్పించుకు తిరుగుతున్నారు.

గురువారం ఏపీ హైకోర్టు పితాని కుమారుడు వెంకట సురేష్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను విచారించింది. అయితే తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తమను అరెస్ట్‌ చేస్తారనే పక్కా సమాచారంతో వారిద్దరూ ముందుస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు సాగించారు. తమ ప్లాన్‌ లీక్‌ కావడంతో ఏసీబీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే అరెస్ట్‌కు సిద్ధమయ్యారు. అయితే మురళీ దొరకగా,, పితాని వెంకట సురేష్‌ మాత్రం పరారిలో ఉన్నారు. ఆయన కోసం ఏసీబీ అధికారులు నిన్నటి నుంచి గాలిస్తున్నారు.

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వచ్చే వరకూ దొరకకూడదని పితాని వెకంట సురేష్‌.. ఆ లోపు అతన్ని పట్టుకోవాలని ఏసీబీ అధికారులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. పితాని కుమారుడు.. ఇప్పటికే రాష్ట్రం దాటి బయటకు వెళ్లిపోయారని సమాచారం. మురళీని అరెస్ట్‌ చేయడంతోనే అప్రమత్తమైన పితాని కుమారుడు హైదరాబాద్‌కు పారిపోయాడని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు తమకు అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు పితాని కుమారుడును పట్టుకునేందుకు హైదరబాద్‌ వెళ్లారు. మరి అక్కడైనా అతను దొరుకుతాడా..? లేదా..? చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి