iDreamPost

తెలంగాణలోనూ ఈఎస్ఐ స్కాం చర్చలు… సోదాలు

తెలంగాణలోనూ ఈఎస్ఐ స్కాం చర్చలు… సోదాలు

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన ఈఎస్ఐ స్కాం ప్రకంపనలు తెలంగాణలోనూ మొదలయ్యాయి. ఇక్కడ కూడా దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే సీపీఎం డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో గతంలో కూడా ఎన్నో సార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు పేర్కొంది. మందుల కొనుగోళ్లు, టెండర్లలో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపిస్తోంది. దీంతో ఆ స్కాం కి సంబంధించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం బయటపడడంతో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. ఈ కేసులో అచ్చెన్నాయుడు ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈఎస్‌ఐ లిస్టులో లేని కంపెనీలు నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు తేలిందని పేర్కొంది. ఈఎస్ఐ డైరెక్టర్లు రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు రూ.51కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. మొత్తం రూ.988 కోట్లకు సంబంధించి రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగిందని గుర్తించారు. ఈఎస్‌ఐ రవికుమార్, రమేష్, విజయను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే.. 135శాతం అధికంగా టెండర్లలో చూపించిన సంస్థలు నకిలీ కొటేషన్లతో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని రిపోర్ట్‌లో వెల్లడించింది.

కోదాడలో ఏం జరిగింది..?

ఏపీ లోని ఈఎస్ఐ స్కాంకి సంబంధించి తెలంగాణ లో కూడా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ స్కాం లో ఏ-1 నిందితుడు ఈ ఎస్ ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్, అచ్చెన్నాయుడు ని ఏ-2 గా ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అలాగే తెలంగాణలోని కోదాడ కు చెందిన ప్రమోద్ రెడ్డి ఈ స్కాం లో ఏ-3 నిందితుడు. హైదరాబాద్ కేంద్రంగా పనచేస్తున్న టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ గా ప్రమోద్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచీ ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. దీంతో ఏసీబీ అధికారులు కోదాడ వచ్చి ప్రమోద్ రెడ్డి కుటుంబ సభ్యుల ను, బంధువులను, స్నేహితులను విచారించారు. దీంతో తెలంగాణ లోనూ ఈఎస్ఐ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఏపీ లోని గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ ఎస్ఐ కుంభకోణంలో అధికారులు పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తుంటే.. టీడీపీ మాత్రం అవినీతి పరుల భజన చేస్తూనే ఉంది. అక్రమార్కులకు అండగా ఉంటామని ఆ పార్టీ నేతలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వీటిపై ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం దర్యాప్తులో రాజీ పడేది లేదని, మున్ముందు మరింత పాత్రలు వెలుగు లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి