iDreamPost

మేల్కొంది.. అవినీతిపరుల భరతం పడుతోంది..

మేల్కొంది.. అవినీతిపరుల భరతం పడుతోంది..

ఏడు నెలలుగా ఉండీ లేనట్లుగా ఉన్న ఆంధప్రదేశ్‌లోని అవినీతి నిరోధక శాఖ ఇప్పుడు ఒక్కసారిగా జూలువిదుల్చుతోంది. అవినీతి అధికారుల భరతం పడుతోంది. అవినీతిని సహించబోనని ప్రమాణస్వీకారం రోజునే తన వైఖరిని స్పష్టం చేసిన సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆ మేరకు పలుమార్లు అధికారులను, ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు. రాజకీయ అవినీతిని దాదాపు కట్టడి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి నియంత్రణపై ఆశించన ఫలితం రాలేదు.

అధికారుల అవినీతిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా ఏసీబీలో కదలిక లేదు. ఏడు నెలలైనా పనితీరులో మార్పు లేకపోవడంతో ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ కుమార్‌ విశ్వజిత్‌ స్థానంలో పి.సీతారామంజనేయులను ఈనెల 4వ తేదీన నియమించారు.

అప్పటి వరకు రవాణాశాఖ కమిషనర్‌గా ఉన్న సీతారామంజనేయులు ఏసీబీ డీజీ వచ్చిన రోజే ప్రభుత్వ లక్ష్యాన్ని తన మాటల్లో వెలిబుచ్చారు. మరుసటి రోజు నుంచే అవినీతిపరులను హడలెత్తిస్తున్నారు. అవినీతిపై ఫిర్యాదుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14400 టోల్‌ ఫ్రి నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ దాడులు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులపై కూడా దాడులు చేసిన అక్రమ ఆస్తుల చిట్టాను విప్పుతున్నారు.

ఈ నెల 7వ తేదీన..

– ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ డివిజనల్‌ మేనేజర్‌ రామకృష్ణ ఇంటిపై దాడులు చేశారు. అవినీతి ఆరోపనణలపై ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న రామకృష్ణ ఇళ్లు, బినామీలు, బందువుల ఇళ్లలో సోదాలు చేసి అర కిలో బంగారు, 1.5 కిలోల వెండి, 8.67 లక్షల నగదు, 16 లక్షల రూపాయల విలువైన ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 3.08 కోట్ల విలువైన పత్రాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

– నెల్లూరు జిల్లాలో 14400 టోల్‌ ఫ్రి నంబర్‌కు ఓ రైతు నుంచి ఫిర్యాదు రాగా వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నెల్లూరు జిల్లా గోవులపల్లికి చెందిన రైతు తన పట్టాదారు పాసుపుస్తకాల కోసం వీఆర్వో సుధాకర్‌ను సంప్రదించగా లంచం డింమాడ్‌ చేశారు. 17 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వీఆర్‌వ్వోను రెడ్‌హ్యాండెడ్‌ గా పట్టుకుని అరెస్ట్‌ చేశారు.

9వ తేదీన సర్వేయర్‌..

ఈ నెల 9వ తేదీన గుంటూరు జిల్ల సత్తెన పల్లి మండల సర్వేయర్‌ మాండ్రుమూక రాజు ఓ రైతు నుంచి భూ సర్వే కోసం 27 వేల రూపాయలు లంచం డిమాండ్‌ చేశారు. రైతు 14400కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. రైతు నుంచి నగదు తీసుకుంటుండగా సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

ముందస్తు వ్యూహాలు..

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులతోపాటు ఏసీబీ కూడా ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు ప్రణాళికలు రచిస్తోంది. ఏ శాఖల్లో, ఏ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోంది..? అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? అన్న అంశాలపై ఏసీబీ డీజీ స్వయంగా అజెండా రూపొందించుకున్నట్లు శుక్రవారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏకకాలంలో జరిగిన దాడులతో అర్థమవుతోంది.

ఇప్పటి వరకు 14400 టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను సమీక్షించిన డీజీ సీతారామాంజనేయులు వెంటనే కార్యాచరణ రూపొందించారు. శుక్రవారం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై దాడులు చేసి లెక్కల్లో లేని సొమ్ము 10.34 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 13 జిల్లాలో ఒక్కొక్క సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లా పలాస, విజయనగరం జిల్లా కేంద్రం విజయనగరం, విశాఖ జిల్లా అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, కృష్ణా జిల్లా గుణదల, గుంటూరు జిల్లా తెనాలి, ప్రకాశం జిల్లా సింగరాయకొండ, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు జిల్లా మదనపల్లె, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, కర్నూలు జిల్లా ఆధోని, అనంతపురం జిల్లా అనంతపురం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేయడంతో రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు తమ కార్యాలయాలపై దాడులు జరుగుతాయన్న భయంతో కొట్టుమిట్టాడుతున్నారు.

ఏసీబీ డీజీగా రామాంజనేయులు బాధ్యతలు చేపట్టిన ఏసీబీ పనితీరు పూర్తిగా మారిపోయింది. ఇదే ఒరవడి కొనసాగిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకునేందుకు ఏ అధికారి కూడా సాహసం చేయకపోవచ్చు. వైఎస్సార్‌సీపీ సర్కార్‌ ఆశించిన అవినీతి రహిత పాలన లక్ష్యం స్వల్పకాలంలోనే చేరుకునే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి