iDreamPost

మా బాబే – కొత్త పలుకులు

మా బాబే – కొత్త పలుకులు

ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చే ‘కొత్త పలుకు’ చదివిన వారెవరికైనా చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీలోని వ్యక్తుల కన్నా వేమూరి రాధాకృష్ణ (ఆర్కే)గారికే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అనిపించకమానదు. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని, రాజకీయ నాయకుల్ని ఆర్కే తన ఏబీఎన్ ఛానెల్లో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ అంటూ ఒక కార్యక్రమం చేస్తుంటారు. ఆ కార్యక్రమానికి సినిమా రంగం నుంచి సీనియర్లు ఎవరు వచ్చినా కూడా ఎలాగోలా ఎన్టీ రామారావు ప్రస్తావన తీసుకునిరావడం, ఆయన్ని ఏదో రకంగా పొగిడే కార్యక్రమం తరచూ చేస్తుంటారు. అలాగే రాజకీయ రంగం నుంచి ఎవరు ఆ కార్యక్రమానికి వచ్చినా చంద్రబాబునాయుడు గురించి వారి దగ్గర ఏదైనా గొప్పగా చెప్పించాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ డ్యామేజీ కంట్రోల్ చేయడానికి బహిరంగంగానే చంద్రబాబును వెనకేసుకొస్తుంటారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కీలక పాత్ర పోషించిన నాయకుల్లో దేవినేని నెహ్రు ఒకరు. 1995 చంద్రబాబు వెన్నుపోటు(రాధాకృష్ణ గారికి అది తిరుగుబాటు) సమయంలో కూడా ఆయన ఎన్టీఆర్ వర్గంలోనే ఉన్నారు. ఆయన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’కు వచ్చినప్పుడు ఆ వైశ్రాయ్ వెన్నుపోటు ఎపిసోడ్, ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించిన సంఘటనల గురించి ప్రస్తావన వచ్చింది. ఆ వెన్నుపోటు సమయంలో దేవినేని నెహ్రూను కూడా తన వైపుకు తిప్పుకునేందుకు చంద్రబాబు జరిపిన మంతనాల్లో హరికృష్ణను ఉద్దేశించి ఒక బూతు మాట అన్నారని దేవినేని ఏబీఎన్ టీవీ ఛానెల్లోనే యథాతథంగా చెప్పారు. ఆ మాట ఆయన చెప్పిన వెంటనే “ఆయన సాధారణంగా ఆ మాట అనరే, ఆ మాట ఆయనకు రాదే..” అంటూ ఆర్కే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసేశారు. ఆయన సమక్షంలో చంద్రబాబును పొగుడుతూ మాట్లాడితే ఆయన కూడా “అవునవును, ఆయనకు అన్నీ చాలా పద్దతిగా ఉండాలి, ఆయన డిసిప్లిన్, ఆ కథంతా వేరు అసలు, ఆయన చాలా సింపుల్, ఆర్భాటాలు ఉండవు” అంటూ వంత పాడుతారు. ఎవరైనా ఇలా అసలు నిజాలు చెబితే మాత్రం వాటి మీద వెంటనే మసి పూసే ప్రయత్నం ఏ మాత్రం తడబడకుండా చేసేస్తుంటారు.

చంద్రబాబు అసెంబ్లీ మార్షల్ ను ఉద్దేశించి ‘బాస్టర్డ్’ అన్నారని సభలో జరిగిన రభస గురించి ఈ రోజు ‘కొత్త పలుకు’లో ఆర్కే ప్రవచిస్తూ ‘చంద్రబాబు ఆ మాట అన్నానేమో అని భావించి’ అంటూ చంద్రబాబును ఒక ఆత్మబంధువు లాగా అర్ధం చేసుకుని వెనకేసుకొచ్చిన వైనం ‘నభూతో నభవిష్యతి’. నిజానికి ‘నభూతో నభవిష్యతి’ అనే మాట ఆర్కే చంద్రబాబును వెనకేసుకొచ్చే విషయంలో వాడటం సాహసమే, ఎందుకంటే ‘ఏ విషయంలో అయినా చంద్రబాబును వెనకేసుకురావడానికి ఇంత కన్నా దిగడం కష్టం’ అని జనమనుకున్న ప్రతిసారి ఆర్కే తన పదవిన్యాసాలతో మరోసారి ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు కనుక.

అసలు ఈ వ్యవహారం సభలో మొదలయ్యాక తెలుగుదేశం శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ‘సభ బయట జరిగిన విషయం ఇక్కడెందుకు’ అన్నట్టుగా ఒక మాట అన్నారు. అయన కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్టే అనుకోవాలా లేక చంద్రబాబు ‘నో క్వశ్చన్’ అన్న మాటనే ఆయన కూడా తప్పుగా అలా అర్ధం చేసుకున్నారనుకోవాలా ? “ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలోకి రావాల్సిన గేటు నుంచి కాకుండా మరో గేటు నుంచి అసలు ఎందుకొచ్చారు ?” అని అధికారపార్టీ సభ్యులు నిలదీసిన ప్రశ్నకు ప్రతిపక్షం వారు సమాధానం ఇవ్వలేదు, ఆ విషయం గురించి కూడా ఆర్కే ప్రస్తావించుంటే బాగుండేది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపేందుకు ఏ మాత్రం ఢోకా లేనంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రతిపక్ష వైసీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ తమ వైపుకు లాక్కున్నారు. “ప్రతిపక్షాన్ని ‘బుల్ డోజ్’ చేయాలని చూస్తున్నార”న్న ప్రవచనం చంద్రబాబు హయాంలో ఏ రోజూ చెప్పని ఆర్కే పాపం ఈ రోజు ‘సంఖ్యాబలం కారణంగా ప్రతిపక్షాన్ని అధికారపక్షం బుల్డోజ్ చేయాలని చూస్తోంది’ అంటూ వాపోవడం ఆయనకు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు మీద ఉన్న ప్రేమకు తార్కాణం. ఈ ‘బుల్డోజ్’ లాంటి పదాలు వాడటమనే సంగతి పక్కన పెడితే అసలు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడటానికి కారణం పార్టీ నాయకత్వ ధోరణే అన్నట్టు పత్రికాముఖంగా వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం చేసేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించని రోజు లేదు.

కేసీఆర్, జగన్ ల మధ్య రాజకీయ సంబంధాలు ఎలా ఉన్నా అవి ప్రజలకు అనవసరం. ఎన్నికల ముందు కేసీఆర్ తెలుగుదేశాన్ని తూర్పారబట్టగానే ‘వైసీపీని గెలిపించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వతంత్రంగా కాకుండా కేసీఆర్ చెప్పుచేతల్లో ఉన్నాడు’ అంటూ అర్ధం లేని రాతలు రాశారు. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఈ నిరాధార రాతలు రాస్తున్నారో కూడా వారికే తెలియాలి. ఇక ఆంగ్ల మాధ్యమం విషయం మీద జనాల్లో వచ్చిన ఆమోదం ఎక్కడ ప్రభుత్వానికి మరింత ప్రజాదరణను చేకూరుస్తుందేమోననే ఆర్కే అసహనాన్నివర్ణించలేము, అది ఆయన మాటల్లోనే చదవాలి.

రాజకీయ నాయకులు కుల రాజకీయం చేశారంటే అది ఓటు బ్యాంకు కోసం అనుకోవచ్చు. కానీ ఒక బాధ్యతాయుత మీడియా పదే పదే సామాజికవర్గాల ప్రస్తావన తీసుకొచ్చి ‘అచ్చో’సి వదలడం మాత్రం బాధ్యతారాహిత్యం.’తెలుగుదేశం’ పార్టీ కూడా తమ ఓటమికి కారణాలే లేవన్నట్టు ప్రజల్ని నమ్మించడానికి రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. ‘నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా’ అంటూ కొన్ని రోజులు వైవిధ్యంగా నాటకాలు ఆడారు. ఎట్టకేలకు ఇక లాభం లేదని అన్నిటికీ ముగింపు పలికారు. కానీ ఆర్కే మాత్రం తెలుగుదేశం ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు.

మొన్న అక్టోబర్ 27 న కొత్తపలుకులో వైసీపీ గెలవడానికి ప్రధాన కారణం ‘కమ్మ సామాజికవర్గం మీద ఇతర వర్గాలలో వైషమ్యాన్ని వ్యాప్తి చేయడంలో సఫలం అయ్యారు’ అన్నట్టు తన రాశారు. మళ్ళీ ఈ రోజూ అదే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ఆంగ్లమాధ్యమానికి, మతమార్పిళ్లకు ముడిపెడుతూ క్రైస్తవ మిషనరీలకు చెందిన విద్యాలయాల మీద; చంద్రబాబు ఓటమికి ఆయన పరిపాలనా వైఫల్యం కాదని నమ్మించేందుకు ఇలా సామాజికవర్గాల ప్రస్తావన తీసుకొచ్చి ఆర్కే చేస్తున్న వ్యాక్యాలు చూస్తుంటే ప్రభుత్వం మీద ఎలా అయినా వ్యతిరేకత తీసుకొచ్చేందుకు

కులమతాల మధ్య చిచ్చు రాజేసి విధంగా ఉంటోందని పలువురి అభిప్రాయం.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు ఆర్కే రాజ్యసభకు ఎంపీగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న పుకార్లు, వార్తలు, ఆరోపణలు చాలా వచ్చాయి. వాటి వెనుక అసలు వాస్తవాలేమిటో ఆరోపించిన వారికే తెలియాలి. అవి నిజమే అనుకుంటే – కారణాలేవైనా గత ఐదేళ్ళలో కుదరలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఆ సంఖ్యాబలం కూడా లేదు. అయినా సరే – ఏ మాత్రం రాజీపడకుండా, చంద్రబాబును భారంలా కాకుండా ఒక బాధ్యతగా మోసేందుకు ఆర్కే ఎప్పుడు ముందువరసలో ఉంటాడు. ఏది ఏమైనా వారం వారం వచ్చే ఆర్కే ‘కొత్త పలుకు’ – తెలుగుదేశం పార్టీ వారి ఆక్రోశానికి, అసహనానికి, ఉడుకుబోతుతనానికి ప్రతిబింబం అనిపించకమానదు.

అసలు ఆర్కేకు చంద్రబాబు మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ గురించి ఇంత భారతం చెప్పాల్సిన అవసరం కూడా లేదనిపిస్తోంది. ఈ రోజు ‘కొత్త పలుకు’ కాలమ్ కు ‘ఇద్దరు ముఖ్యమంత్రుల ముచ్చట’ అని హెడ్డింగ్ పెట్టి మధ్యలో ఉన్న ఫోటోలో కేసీఆర్, జగన్ లతో పాటు చంద్రబాబు ఫోటో కూడా పెట్టారంటేనే అర్ధం చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి