iDreamPost

ఒకే రోజు మూడు లీకేజి ప్రమాదాలు…

ఒకే రోజు మూడు లీకేజి ప్రమాదాలు…

ఉదయం ఆంధ్రప్రదేశ్, మధ్యాహ్నం ఛత్తీస్గడ్, సాయంత్రం తమిళనాడు.. ఇలా దేశంలోని పలు రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఎల్జి పాలిమర్ కంపెనీలో విష వాయువు లీకేజీ ప్రమాదంలో 11 మంది మరణించగా, వందల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఓ వైపు విశాఖ ఘటన పై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తలమునకలై ఉండగా మరోవైపు మధ్యహాన్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. రాయగడ జిల్లాలోని ఓ పేపర్ మిల్లు లో విషవాయువులు వెలువడడం వల్ల ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. కొద్ది రోజులుగా నిరుపయోగంగా ఉన్న ఓ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా విషవాయువులు వెలువడ్డాయి. చాలా రోజులుగా ఆ ట్యాంక్ ను ఉపయోగించిన కారణంగా అక్కడ విషవాయువులు తయారయ్యాయని అధికారులు గుర్తించారు. ఇలాంటి ఘటనే రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. రొయ్యల శుద్ధి కర్మాగారంలో ఓ ట్యాంక్ ను క్లీన్ చేసేందుకు వెళ్లిన కార్మికులు విషవాయువులు వెలువడిన కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఏపీ, ఛత్తీస్గడ్ ఘటన తాలూకు ప్రభావం నుంచి ఇంకా బయటకు రాకముందే సాయంత్రం తమిళనాడులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు లోని ఎంసిఎల్ ధర్మల్ విద్యుత్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి వెలువడిన పొగ కొన్ని కిలోమీటర్ల మేర వ్యాపించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.

కరోనా వైరస్ నియంత్రణ కు విధించిన లాక్ డౌన్ తో దాదాపు 40 రోజులకు పైగా పూర్తిగా కార్యకలాపాలు స్తంభించిపోయిన పరిశ్రమలు, కర్మాగారాలు ఇతర యూనిట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో రెండు రోజుల నుంచి ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ప్రమాదాలు ప్రభుత్వాలు, పరిశ్రమ వర్గాల తో పాటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కార్యకలాపాలకు ఎక్కువ రోజులు విరామం రావడం.. ఆ తర్వాత ఎలాంటి తనిఖీలు లేకుండా కార్యకలాపాలను ప్రారంభించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మార్చి 24 వ తేదీన కేవలం నాలుగు గంటల ముందు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పరిశ్రమలు ఉన్నపళంగా మూతపడ్డాయి. ఆ యధాతథ స్థితి నుంచి మళ్లీ 40 రోజుల తర్వాత ప్రారంభం కావడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే ముందు రక్షణ విభాగం క్షుణ్ణంగా తనిఖీ చేయడం, డమ్మీ ట్రైల్స్ నిర్వహించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి