iDreamPost

కన్నీళ్లు పెట్టిస్తున్న కొత్త పెళ్లి కూతురి లేఖ.. అత్తారింట్లో ఇలా ఉంటుందనుకోలేదంటూ..

కన్నీళ్లు పెట్టిస్తున్న కొత్త పెళ్లి కూతురి లేఖ.. అత్తారింట్లో ఇలా ఉంటుందనుకోలేదంటూ..

పెళ్లి అనగానే అమ్మాయికి కొన్ని అంచనాలు ఉంటాయి. కాబోయే వరుడు ఇలా ఉండాలని కలలు కంటారు. ముఖ్యంగా తమ భవిష్యత్ ప్రణాళికలు ఈ వివాహ బంధంతోనే ముడిపడి ఉన్నందున ఎన్నో ఆశలతో తమను తాము సంసిద్ధులను చేసుకుంటారు. అలాగే పుట్టింట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు.. పెళ్లితో మరో ఇంటికి వెళుతుంటే.. ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే ఆందోళన చెందుతారు తల్లిదండ్రులు. అప్పగింతల సమయంలో తమ కూతుర్ని.. మీ ఇంటి ఆడపిల్లలా చూసుకోవాలంటూ అత్తమామల చేతుల్లో పెడతారు తల్లిదండ్రులు. కానీ అక్కడకు వెళ్లాక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అత్త మామలు పెత్తనం, ఆడ పడుచుల పోరుతో సతమతమౌతూ ఉంటుంది ఆడ పిల్ల. ప్రతి విషయంలోనూ పుట్టింటిని మధ్యలోకి లాగుతూ.. ఏం పెంపకం అంటూ అమ్మాయి అమ్మా నాన్నలపై కూడా విరుచుకుపడతారు.

అమ్మగారి ఇంట్లో నుండి వచ్చిన ఆడ పిల్ల.. చెప్పకుండానే పని చేయాలని, పొద్దున్నే లేచి ఇంటిపనులన్నీ ముగించాలన్న ఒత్తిడిని తేవడంతో.. అప్పటి వరకు సుకుమారంగా పెరిగిన కొత్త పెళ్లికూతురు తట్టుకోలేకపోతుంది. పోనీ ఎడ్జస్ట్ అవుతామంటే.. సూటీ పోటీ మాటలతో తూట్లు పొడిచినట్లు పొడుస్తున్నారు. ఇది కేవలం కొత్త పెళ్లి కూతుర్లే కాదూ.. కొంత కాలం కాపురం సాగిపోతున్న మహిళలు అత్తారింట్లో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆమెకంటూ ఓ గుర్తింపు ఉండదు. మిషన్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఇక బంధువులు వస్తే చాకిరీ అంతా ఆమెపైనే పడుతుంది. కొత్తగా ఇంటికి వచ్చిన అమ్మాయికి ఇంటిని చక్కదిద్దేందుకు, తమతో కలిసిపోయేందుకు, ఆ వాతావరణంలో ఇమిడేందుకు టైమ్ పడుతున్న విషయం మర్చిపోతున్నారు అత్తింట్లోని వ్యక్తులు. ‘అత్తా ఒకింట కోడలు’ అన్న విషయాన్ని మర్చిపోయి.. కోడలిపై పెత్తనం చేసేందుకు, తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

పుట్టింటికి వెళ్లాలన్నా, అలా బయటకు భర్తతో సరదాగా తిరిగి వద్దామనుకున్నా.. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పర్మిషన్ తీసుకోవాలి. ఏదైనా బాధ వచ్చిన భర్తకు చెప్పినా, తల్లిదండ్రులకు మద్దతుగా మాట్లాడటంతో తన ఇంట్లోనే తాను కానిదానిలా మారిపోతుంది. తాను కలలు కన్న సామ్రాజ్యం.. తనను వెక్కిరిస్తూ ఉంటుంది. మెట్టినింట్లో ఓ పనిమనిషిలా, పనులకే తప్ప మరే అవసరానికి పనికి రాని మరబొమ్మలా మారినందుకు తనను తాను తిట్టుకుంటుంది. పెళ్లి ఎందుకు చేసుకున్నారా దేవుడా అనికోని రోజూ ఉండదు. అలాగే లక్షలు కట్నమిచ్చి పెళ్లి చేసిన తల్లిదండ్రులకు మళ్లీ తాను భారం కాకూడదని, కాంప్రమైజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది ప్రతి మహిళ ఎదుర్కొన్న అనుభవాలే. ఓ మహిళా తాను తన అత్తారింట్లో పడుతున్న కష్టాలకు సంబంధించిన ఓ లేఖ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

అమ్మా నీకోవిషయం చెప్పాలి. అత్తింట్లో అన్ని ఉన్నాయి అనుకున్నాను కానీ.. ఇక్కడ పరిస్థితి దారుణం. పుట్టింట్లో మాదిరి.. అత్తారింట్లో కూడా తనకంటూ ఇష్టా ఇష్టాలు, కోరికలకు విలువ ఉంటుందని అనుకున్నా. కానీ అవేమీ ఇక్కడ లేదు. నీ దగ్గర ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను. అది ఇక్కడ మచ్చుకైనా చూడలేదు. అత్తింట్లో బాధ్యతల బంధాలను అప్పగిస్తూ.. అవసరానికి మించి భారాన్ని మోపుతున్నారు. ఏదైనా పని చేయకపోతే.. మీ అమ్మ ఏం నేర్పిందంటూ కించ పరుస్తున్నారు. నచ్చినది తినడానికి లేదు, ఇష్టమైన దుస్తులు వేసుకోవడానికి వీలు లేదు. నా వల్ల కావడం లేదమ్మా. ఏడుపొస్తుంది. నీ దగ్గరకు వచ్చేసి, నీ ఒళ్లో తలపెట్టుకుని పడుకోవాలని ఉంది. నీ చేతి గోరు మద్దులు తినాలని ఉంది. నీతో, నాన్నతో బాధను పంచుకోవాలనిపిస్తుంది.

నాకు పెళ్లై వస్తేనే కానీ తెలియలేదమ్మా నీ విలువ. నాన్న, మా కోసం నీ జీవితాన్ని ఎంత త్యాగం చేశావో. నువ్వు నాకు స్ఫూర్తిగా నిలుస్తున్నావమ్మా. ఇప్పుడిప్పుడే అత్తారింటి వాతావరణాన్ని, మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దీనికి నువ్వే ఆదర్శమమ్మా అంటూ రాసుకొచ్చింది.  అయితే కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన ఆడ పిల్లకు ఇటువంటి బాధే ఉంటుంది. చెప్పడానికి కూతుర్ని, కోడల్ని ఓకేలా  చూస్తున్నామని చెప్పుకోవడం కాదు. ఆచరణలో  చేసి చూపెట్టాలి.  మన ఆడపిల్లను ఒకలా, మన ఇంటికి వచ్చిన ఆడ పిల్లను మరోలా చూస్తున్న అత్తింటి వారు మేల్కొని.. కోడల్ని.. తమ కుటుంబ సభ్యురాలిగా భావించి నాడే.. వారి జీవితానికి నిజమైన స్థారకత చేకూరుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి