iDreamPost

9 సినిమాలు ఒకే రోజు – Nostalgia

9 సినిమాలు  ఒకే రోజు – Nostalgia

మాములుగా ఏదైనా హీరోది కొత్త సినిమా ఓపెనింగ్ అంటే ఒకటే చూస్తాం. లేదూ ఏదైనా ప్రత్యేకత ఉంది అంటే ఒకే రోజు రెండు మొదలుపెట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. అలా కాకుండా ఏకంగా 9 సినిమాలు ఒకే రోజు మొదలుపెట్టుకున్న హీరో ఉన్నారంటే కొందరు నమ్మకపోవచ్చేమో. కానీ 2002 సంవత్సరం మార్చ్ 24న ఇది జరిగింది. స్వర్గీయ ఎన్టీఆర్ వారసుల్లో ఒకరైన మోహనకృష్ణ తనయుడు తారకరత్నను లాంచ్ చేస్తూ ఏకంగా తొమ్మిది ప్రాజెక్టులకు ముహూర్తపు షాట్ కొట్టడం అంతకు ముందు ఆ తర్వాత ఎప్పుడూ జరగలేదు. అదే ప్రత్యేకత. అప్పట్లో దీని గురించి ప్రింట్ మీడియాలో సైతం భారీ స్థాయిలో వార్తలు వచ్చాయి.

ఆ రోజు వేడుకకు ప్రత్యేక అతిథులుగా నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, హరికృష్ణలతో పాటు నందమూరి కుటుంబాలు సందడి చేశాయి. ఆ 9 సినిమాల్లో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కాగా కొన్ని కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇంత హడావిడి చేసిన తారకరత్న ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్టు కొట్టలేకపోయారు. ఎందరో దర్శకులు ప్రయత్నించినా సక్సెస్ మాత్రం అందని ద్రాక్షే అయ్యింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కూడా ట్రై చేశారు కానీ అవేవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి.

ఇక అప్పుడు మొదలైన ఆ తొమ్మిది సినిమాల వివరాల మీద ఓ లుక్ వేద్దాం. మొదటిది నందమూరి రామకృష్ణ నిర్మాతగా యు.నారాయణరావు దర్శకత్వంలో, రెండోది అంబికా కృష్ణ నిర్మాణంలో బాలసుబ్రమణ్యం డైరెక్షన్ లో, మూడోది సురేష్ కృష్ణ డైరెక్టర్ గా మాగంటి గోపినాధ్ ప్రాజెక్ట్, నాలుగోది సాయికృష్ణ దర్శకుడిగా దగ్గుబాటి సీతారామాంజనేయులు నిర్మాణంలో, ఐదోది రామచంద్రరావు దర్శకత్వంలో ఆచంట గోపినాధ్ నిర్మాతగా, ఆరోది ఉప్పలపాటి సూర్యనారాయణబాబు ప్రొడ్యూసర్ గా ఇంకా డైరెక్టర్ డిసైడవ్వని మూవీ, ఏడోది సత్యానంద్ దర్శకుడిగా బి. సత్యనారాయణ నిర్మాణంలో, ఎనిమిదోది వైవిఎస్ చౌదరితో ప్రసన్న కుమార్ నిర్మాతగా, తొమ్మిదోది సాగర్ దర్శకుడిగా స్వీయ నిర్మాణంలో. ఇలా గ్రాండ్ తో రికార్డు స్థాయిలో ఓపెనింగ్ చేయించుకున్న తారకరత్న ఆ తర్వాత హీరోగా సెటిల్ కాలేకపోవడం బ్యాడ్ లక్కే. బాలకృష్ణ తర్వాత నందమూరి ఫ్యామిలీలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కథానాయకుడిగా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి