iDreamPost

ముగియనున్న 72 మంది ఎంపీల పదవీకాలం

ముగియనున్న 72 మంది ఎంపీల పదవీకాలం

అనుభవజ్ఞుల వేదిక పెద్దల సభ. ఆ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడుగురు నామినేటెడ్‌ సభ్యులు సహా 72 మంది పదవీకాలం ముగియనుంది. ఈ ఏడాది మార్చి-జూలై మధ్య కాలంలో అంటే రాబోయే వర్షాకాల సమావేశాల్లోపు వారు పదవీ విరమణ చేయనున్నారు. 72 మంది అంటే రాజ్యసభ మొత్తం సభ్యుల్లో మూడోవంతు కావడం గమనార్హం. పదవీ కాలం ముగుస్తున్న వారిలో 19 రాష్ట్రాలకు చెందిన సభ్యులు ఉన్నారు. కొందరు ఐదుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పదవీవిరమణ చేయనున్న వారిలో ఏకే ఆంటోనీ, అంబికా సోని, పి.చిదంబరం, ఆనంద్‌ శర్మ, జైరాం రమేశ్‌, సురేశ్‌ ప్రభు, ప్రఫుల్‌ పటేల్‌, సుబ్రహ్మణ్యస్వామి, ప్రసన్న ఆచార్య, సంజయ్‌ రౌత్‌, నరేశ్‌ గుజ్రాల్‌, సతీశ్‌చంద్ర మిశ్రా, మేరీకోమ్‌, స్వపన్‌దాస్‌ గుప్తా, నరేంద్ర జాదవ్‌ తదితరులు ఉన్నారు.

ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాలే వీరికి చివరి సమావేశాలు కావడంతో గురువారం రాజ్యసభ ఘనంగా వీడ్కోలు పలికింది. వీడ్కోలు సభలో చైర్మన్‌ వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. జ్ఞానం కంటే అనుభవం మరింత శక్తివంతమైందని ప్రధాని మోడీ అన్నారు. రిటైర్‌ అవుతున్న ఎంపీల అనుభవాన్ని దేశ సేవ కోసం వినియోగించాలని సూచించారు. ‘‘మనం ఈ నాలుగు గోడల (సభ) నుంచి బయటకు వెళ్తుండవచ్చు. కానీ, ఈ అనుభవాన్ని ఇక్కడి నుంచి దేశ ప్రయోజనాల కోసం నలు దిశలకూ వ్యాపింపజేయాలి’’ అని మోడీ పేర్కొన్నారు. పదవీకాలం ముగుస్తున్న వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. వారు మళ్లీ సభకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఇక్కడ మీ అనుభవాలు, భాగస్వామ్యాలను పుస్తకరూపంలో తీసుకురండి. అవి రాబోయే తరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. స్ఫూర్తి నింపుతాయి’’ అని మోడీ సూచించారు.

చైర్మన్‌ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. దేశం నలుమూలల నుంచి వచ్చిన చట్టసభ సభ్యులకు సేవ చేయాలన్న తపన ఉండాలన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు సభ్యుల నిరసనల కారణంగా 35 శాతం సభాకార్యకలాపాల సమయాన్ని కోల్పోయినట్లు తెలిపారు. పదవీకాలం ముగుస్తున్న సభ్యులు అపార అనుభవజ్ఞులని, వారి సేవలు మరచిపోలేనివని చెప్పారు. ప్రధాని, ఇతర సభ్యులు చెప్పిన మాటలు విన్న తర్వాత రాజ్యసభ ఎంత ప్రధానమైనదో తనకు అర్థమైందని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు.

కాగా, పదవీ విరమణ చేస్తున్న వారిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్‌, విజయసాయిరెడ్డి, సురేశ్‌ ప్రభు, తెలంగాణ నుంచి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

ఇప్పుడు పదవీ కాలం ముగుస్తున్న ముఖ్యుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,వైసీపీ నేత విజయసాయిరెడ్డి లాంటి నేతలకు మరోసారి రాజ్యసభ అవకాశం దక్కవచ్చు.కానీ చిదంబరం,ఏ కే ఆంటోని లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలకు మరోసారి రాజ్యసభకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు.

టీడీపీ తరపున ఎన్నికయ్యి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, టిజి వెంకటేష్ లాంటి నేతలకు కూడా ఇదే చివరి అవకాశం కావచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి