iDreamPost

68th National Film Awards ఉత్త‌మ తెలుగు చిత్రం క‌ల‌ర్ ఫోటో, ఉత్త‌మ న‌టుడు సూర్య ,అజయ్‌ దేవ్‌గణ్

68th National Film Awards ఉత్త‌మ తెలుగు చిత్రం క‌ల‌ర్ ఫోటో, ఉత్త‌మ న‌టుడు సూర్య ,అజయ్‌ దేవ్‌గణ్

68వ జాతీయ సినిమా అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను అంద‌చేయ‌నున్నారు. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీప‌డితే, 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు ద‌క్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా, సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన కలర్‌ ఫొటో ఎంపికైంది.

న్యూఢిల్లీలో 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించారు. 2020 యేడాదికి ఉత్తమ నటుడి అవార్డును సూరరై పొట్రు- తెలుగులో ఆకాశమే నీ హ‌ద్దురా, తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్‌లో చూపించిన న‌ట‌న‌కు సూర్య, అజయ్ దేవగన్‌లకు క‌లిపి అవార్డునిచ్చారు. సూర్యకి మొదటి జాతీయ అవార్డు. అజయ్ దేవగన్‌కి మూడవది. 1998 సినిమా జఖ్మ్ , 2002 లో రిలీజ్ అయిన‌ ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్‌కి ఉత్తమ నటుడిగా అవార్డులు సాధించాడు.

డెక్కన్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు జి గోపీనాథ్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తీర్చిదిద్దిన‌ సూరరై పొట్రు జాతీయ ఉత్త‌మ చలన చిత్రంగా నిలిచింది. అపర్ణా బాలమురళికి ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే ,ఉత్తమ నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డులు ద‌క్కాయి. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రిమేక్ అవుతోంది. హీరో అక్ష‌య్ కుమార్.

ఇక‌ తాన్హాజీ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డును గెలుచుకుంది.

మలయాళ థ్రిల్లర్ అయ్యప్పనుమ్ కోషియుమ్(Ayyappanum Koshiyum) స‌త్తాచూపించింది. రెండు పెద్ద అవార్డులను గెలుచుకుంది. K R సచ్చిదానందన్ మరణానంతరం ఉత్తమ దర్శకుడిగా, బిజు మీనన్ ఉత్తమ సహాయ నటుడిగా నిలిచారు. ఈ డైరెక్ట‌ర్ 2020లో 47 ఏళ్ల వయసులో గుండెపోటుతో చ‌నిపోయారు.

లక్ష్మీ ప్రియా చంద్రమౌళి(Lakshmi Priyaa Chandramouli), శివరంజనియుమ్ ఇన్నుమ్ సిల పెంగళం చిత్రానికి ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకుంది. ఈ సినిమా ఉత్తమ తమిళ సినిమా, ఉత్తమ ఎడిటింగ్ అవార్డుల‌ను కూడా గెలుచుకుంది.

డొల్లు ఉత్తమ కన్నడ చిత్రం, ఉత్తమ లొకేషన్ సౌండ్ అవార్డులను గెలుచుకుంది. ఇక‌ అవిజాట్రిక్(Avijatrik ) ఉత్తమ బెంగాలీ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులను గెలుచుకుంది.

ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో(Colour Photo ), ఉత్తమ మలయాళ చిత్రంగా తింకలజ్చ నిశ్చయం అవార్డులు అందుకున్నాయి.

ఈ సంవత్సరం ఫీచర్ ఫిల్మ్ జ్యూరీకి ఫిల్మ్ మేకర్ విపుల్ షా నేతృత్వం వహిస్తున్నారు; జ్యూరీ సభ్యుడు , సినిమాటోగ్రాఫర్ ధరమ్ గులాటి ఈ అవార్డులను ప్రకటించారు.

ఉత్తమ సంగీత దర్శకుడు (పాట‌లు): – తమన్‌ (అల వైకుంఠపురములో)
ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌( బీజీఎం) : జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (సూరరై పోట్రు -తమిళం)
బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం: సూరరై పోట్రు
బెస్ట్‌ స్టంట్స్‌ – అయ్యప్పనుమ్‌ కోషియమ్‌
ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం -తెలుగు)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: టీవీ రాంబాబు – నాట్యం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి