iDreamPost

Viva Harsha: కలర్ ఫొటో లేకపోతే నా ఫొటో కూడా అంతే

వైవా హర్ష అంటా తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు, యూట్యూబ్ ఫాలోవర్స్ ఉండరేమో. అయితే అతనికి ఈ స్థాయి గుర్తింపు అంత తేలిగ్గా ఏమీ రాలేదు.

వైవా హర్ష అంటా తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు, యూట్యూబ్ ఫాలోవర్స్ ఉండరేమో. అయితే అతనికి ఈ స్థాయి గుర్తింపు అంత తేలిగ్గా ఏమీ రాలేదు.

Viva Harsha: కలర్ ఫొటో లేకపోతే నా ఫొటో కూడా అంతే

వైవా హర్షా అంటే ఈ రోజున ఎవ్వరికీ పరిచయం చేయనక్కర్లేదు. యూట్యూబ్ ప్రపంచం ప్రారంభమైన తొలిరోజుల్లో హర్షా చేసిన వైవా వైరల్ అయినంత హోరాహోరీగా మరే వీడియో వైరల్ కాలేదు. అదే అతనికి సినీ పరిశ్రమ సింహద్వారాలను తెరిచింది. అమాయకంగా వైజాగ్ వీధుల్లో తిరుగుతున్న పైలాపచ్చీసు కుర్రాడు కాస్త సినిమా పరిశ్రమ కళ్లల్లో పడ్డాడు. వైజాగ్ లో ఇంక ఉండలేని పరిస్థితి ఎదురైంది. హైదరాబాద్ మకాం మార్చేసి, అవకాశాల యుద్ధంలో పడిపోయాడు హర్ష. తర్వాతే వైవా హర్షగా చెలామణిలోకి వచ్చిన హర్ష నటజీవితానికి శ్రీకారం జరిగింది. కానీ అవకాశాలు మాత్రం ఏమంత గొప్పగా రాలేదు. ఏ వేషం అంటే ఆ వేషం, ఎలా పడితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్న హర్షలో ఎక్కడో అలజడి మొదలైంది. చేస్తున్నాడంటే చేస్తున్నాడు గానీ, రంగురుచి వాసనా లేని వేషాలు. ఎప్పుడు బ్రేక్ వస్తుందో తెలియని అయోమయం.

‘’అలాగని వచ్చిన క్యారెక్టర్స్ చేయకపోతే రన్నింగ్ కష్టమైపోతుంది. ఏదో ఒకటి చేస్తున్నాను. గడిచిపోతోంది. ఎవరిని ఏమి అడగాలో తెలియదు. ఏ బ్యాక్ గ్రౌండూ లేదు. అందరూ ప్రేమగా అయితే చూస్తూ వచ్చారు. అదొక్కటే రిలీఫ్. కానీ మనసులో ఉంటుంది కదండీ.. ఒరేయ్ వచ్చావు ఏం సాధించావురా అని. అలాగని వెనక్కి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. తాడోపేడో ఇక్కడ తేల్చుకోవాలని ఉండిపోయాను. నా ఫాధర్ అండ్ మదర్ కూడా ఎంకరేజ్ చేశారు. అదిగో అప్పుడొచ్చింది కలర్ ఫొటో సినిమా. అదే నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. నన్నే కావాలని, నాకే ఆ క్యారెక్టర్ అని ఫిక్స్ అయి మరీ వచ్చిన అవకాశం అది. కలర్ ఫొటో… ఏ రంగూ లేని నా కెరీర్ కి ఈస్ట్ మన్ కలర్నిచ్చింది. అప్పటి నుంచి నాకొచ్చిన అవకాశాల కలర్ కూడా మారిపోతూ వచ్చింది.

నన్ను సీరియస్ గా ఫాలో అవుతున్న అందరికీ చెబుతున్నా.. మధ్యలో వదలి వెళ్ళిపోకండి. కష్టమో నష్టమో ఆగండి. శ్రమ పడండి. తప్పకుండా ఒకరోజు మనదవుతుంది. అందుకు నేనే ఒక ఉదాహరణ. తర్వాత ఒక్కొక్క డ్రీమ్ జరుగుతూ వచ్చాయి. చిరంజీవిగారితో ఎప్పటికైనా చేయలేకపోతానా అనుకునేవాడిని. భోళాశంకర్ సినిమాతో ఆ కోరిక తీరింది. ఇప్పుడు నేనే లీడ్ క్యారెక్టర్ గా నాలుగైదు సినిమాలు ప్రారంభం కానున్నాయి. ఇదంతా ఫేట్ అనుకుంటే ఒకటి. అందులో మన డెడికేషన్ కూడా చాలా అవసరం. ఫెబ్ 2వ తేదీన రాబోతున్న సుందరం మాస్టర్ సినిమా మళ్ళీ నాకొక బ్రేక్ అవుతుంది. రవితేజాగారు బంగారం.

ఏ బ్యాక్ గ్రౌండూ లేకుండా ఆయన వచ్చి ఇంత గొప్ప సక్సెస్ సాధించినందుకు, ఆయనలా వచ్చిన మా లాంటి వాళ్ళని ఆయన నిండుమనసుతో ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ప్రోత్సాహం లేకపోతే సుందరం మాస్టర్ జరిగుండేది కాదు. అలాగే నాతో మొట్టమొదట వైవా షార్ట్ ఫిల్మ్ తీసిన శబరీష్ కాండ్రేగుల డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నాను లేట్ అయింది. కానీ ఇప్పటికైనా మా శబరీష్ తో చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. క్యారెక్టర్లుంటాయి. రైటర్స్ అండ్ డైరెక్టర్స్ పూనుకుని, వెతికితే మాలాంటి వాళ్ళకి కూడా ప్రత్యేకమైన లీడ్ క్యారెక్టర్స్ దొరుకుతాయి అన్నది నా ఫీలింగ్. తెలుగు సినిమా ఎన్నో రకాలుగా మారిపోయిందిప్పుడు. ఆ మార్పు మాకు బెటర్ అవకాశాలను తెస్తుందని నమ్ముతున్నాను’’ అని ఐ డ్రీమ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో వైవా హర్ష చెప్పాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి