iDreamPost

Viral News నీట్ రాసిన 55 ఏళ్ళ రైతు, డాక్ట‌ర్ అవుదామ‌నుకొంటున్నాడు

Viral News నీట్ రాసిన 55 ఏళ్ళ రైతు, డాక్ట‌ర్ అవుదామ‌నుకొంటున్నాడు

కలలు సాకారం చేసుకోవడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నాడో పెద్దాయన. 55 ఏళ్ళ వయసులో నీట్ (NEET) పరీక్ష రాశాడాయన. అంతేకాదు డాక్టర్ అయ్యే తీరతా అని న‌మ్మ‌కంగా చెబుతున్నాడు. ఆయ‌న‌ది తమిళనాడులోని అంబట్టయన్ పట్టి. ఈ సీనియర్ మోస్ట్ స్టూడెంట్ పేరు కె. రాజ్యక్కోడి. 1984లోనే ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఆయనకు సీటొచ్చింది. ఫీజులు కట్టలేక , కోర్సులో జాయిన్ కాలేదు. ఆ తర్వాత బీఎస్సీ ఫిజిక్స్ లో చేరాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆ చదువు కూడా మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. చివరికి వ్యవసాయం చేసుకుంటూ రైతుగా స్థిరపడిపోయాడు.

కిందటేడాది ఒడిషాకు చెందిన 64 ఏళ్ళ వ్యక్తి మెడికల్ కాలేజ్ లో సీటు సంపాదించుకున్నాడని తెలిసి, తాను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నాడు. అంతే , చిన్న కొడుకు వాసుదేవన్ స్టడీ మెటీరియల్ ముందేసుకుని రోజుకు 3 గంటల పాటు చదివాడు. మోడల్ పరీక్షలు కూడా రాసి గట్టిగా ప్రిపేరయ్యాడు. చివరికి ఈ ఆదివారం నీట్ పరీక్ష రాసేశాడు.

సెక్యూరిటీ సిబ్బంది మొదట్లో రాజ్యక్కోడిని ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళనీయలేదు. కానీ హాల్ టికెట్ చూపించాక నోరెళ్ళబెట్టి లోపలికి పంపించారు. ఎగ్జామ్ లో 460 మార్కులు వస్తాయని ఉత్సాహంగా చెబుతున్నాడీ అపర విక్రమార్కుడు. పైగా ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వెషన్ పేపర్ చాలా ఈజీగా వచ్చిందట. చిన్న కొడుకు నీట్ లో 521 స్కోరు చేసి గవర్నమెంటు మెడికల్ కాలేజీలో సీటు సంపాదించాడు. ఈయన కూడా సీటు కొడితే ఒకేసారి మెడిసిన్ చదువుతున్న తండ్రీ కొడుకులుగా ఇద్దరూ రికార్డులకెక్కుతారేమో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి