iDreamPost

నేడే 50వ రోజు – కిక్కు కోరుతున్న టాలీవుడ్

నేడే 50వ రోజు – కిక్కు కోరుతున్న టాలీవుడ్

ఇంకో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచి రెండు నెలలు పూర్తవుతుంది. అంటే ఇవాళ్టికి అర్ధ శతదినోత్సవం అన్నమాట. అయితే ఇదేదో గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదిప్పుడు. ఎందుకంటే చాలా సినిమాలు విడుదలైనా కూడా ఇప్పటిదాకా ఇది మా సత్తా అని చాటుకునే స్థాయిలో బాక్సాఫీస్ ఫిగర్లు నమోదు కాకపోవడమే. ముందు తిమ్మరుసు లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ వస్తే అవి ఒక వర్గానికే కాబట్టి కొంత నష్టం వచ్చాయన్నారు. ఎస్ఆర్ కళ్యాణ మండపం దాని రేంజ్ కి మించి హిట్టు కొట్టినా పది కోట్ల షేర్ ని టచ్ చేయలేకపోయింది. శ్రీదేవి సోడా సెంటర్ కు ఎంత నష్టం వచ్చిందో ఇంకా బయటికి రాలేదు. అదీ తేలిపోతుంది.

తెగ హడావిడి చేసిన గోపీచంద్ సీటిమార్ కు కనిష్టంగా రెండు నుంచి మూడు కోట్ల నష్టమని ట్రేడ్ నుంచి వినిపిస్తున్న మాట. ఇదే నిజమైతే దాన్ని హిట్ గా పరిగణించలేం. చాలా తక్కువ థియేట్రికల్ బిజినెస్ తో రీజనబుల్ రేట్లకు అమ్మేసుకున్న గల్లీ రౌడీ కలెక్షన్లు కూడా సోసోగా ఉన్నాయి. బ్యాడ్ టాక్ రెవిన్యూ మీద ప్రభావం చూపిస్తోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే భారీ బడ్జెట్ సినిమాలు ఎప్పుడు రావాలనేది అంతు చిక్కని ప్రశ్నగా మారుతోంది. ఈ నెల 24న రాబోతున్న లవ్ స్టోరీ చాలా గట్టిగా ఆడాలి. రికార్డులు నమోదు చేయాలి. అప్పటికి గాని ఎగ్జిబిషన్ రంగం కోరుకున్న ఊపు బాక్సాఫీస్ దగ్గర రాదు.

ఇలా జరగడానికి కారణాలు లేకపోలేదు. ఇన్ని రోజులు అవుతున్నా బలమైన కంటెంట్ ఉన్న కంప్లీట్ ఎంటర్ టైనర్ ఏదీ రాలేదు. అన్నింటిలోనూ ఏదో ఒక మైనస్ శాపంగా మారింది. థియేటర్లకు జనాలు రావడం ఇప్పుడో సవాల్ గా మారింది. ఆషామాషీగా ఏదో మా సినిమా వచ్చి చూసేయండి అంటే కేర్ చేయడం లేదు. కరోనా దెబ్బకు పబ్లిక్ చాలా క్యాలికులేటెడ్ గా హాళ్లకు వస్తున్నారు. బ్రహ్మాండంగా ఉందంటే తప్ప ఫ్యామిలీస్ ని బయటికి రప్పించడం కష్టం. సో లవ్ స్టోరీ కనక అంచనాలు నిలబెట్టుకుంటే అప్పుడు మిగిలిన నిర్మాతలకు ధైర్యం వస్తుంది. ఆపై వరసలో రిపబ్లిక్, కొండపొలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉన్నాయి మరి

Also Read : కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన ప్రేమ వేడుక

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి