iDreamPost

రెండో టీ20లో ఐర్లాండ్‌ చిత్తు.. భారత్‌ విజయానికి 4 ప్రధాన కారణాలు ఇవే!

  • Published Aug 21, 2023 | 7:58 AMUpdated Aug 21, 2023 | 7:58 AM
  • Published Aug 21, 2023 | 7:58 AMUpdated Aug 21, 2023 | 7:58 AM
రెండో టీ20లో ఐర్లాండ్‌ చిత్తు.. భారత్‌ విజయానికి 4 ప్రధాన కారణాలు ఇవే!

ఐర్లాండ్‌తో డబ్లిన్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేస్తూ.. మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇక 23న జరిగే చివరి టీ20లో సైతం విజయం సాధిస్తే.. ఐర్లాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తుంది టీమిండియా. తొలి వన్డే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో విజయం దక్కడంతో అందులో గెలిచిన మజా అంత లేకుండా పోయింది. కానీ రెండో టీ20 పూర్తిగా జరగడం మన బ్యాటర్లు పరుగులు చేయడంతో ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా ఈ మ్యాచ్‌ను బాగా ఎంజాయ్‌ చేశారు. మ్యాచ్‌ గెలిచిన సంతృప్తి సైతం భారత ఆటగాళ్లలో కనిపించింది. అయితే.. రెండో టీ20లో టీమిండియా విజయానికి దోహదం చేసిన అంశాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం..

రుతురాజ్‌-సంజు పార్ట్నర్‌షిప్‌
తొలి మ్యాచ్‌ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ టాస్‌ గెలిచి.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రుతురాజ్‌తో కలిసి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. 11 బంత్లులో 18 పరుగులు చేసి మంచి ఊపులో కనిపించిన జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ 29 పరుగుల వద్ద యంగ్‌ బౌలింగ్‌ కాంఫర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే తిలక్‌ వర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్‌ రుతురాజ్‌తో జతకలిశాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 71 పరుగులు జోడించిన తర్వాత సంజు 26 బంతుల్లో 40 రన్స్‌ చేసి.. దురుదృష్టవశాత్తు అవుట్‌ అయ్యాడు. రుతురాజ్‌ 58 పరుగులతో టీమిండియా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వీరిద్దరి పార్ట్నర్‌షిప్‌ టీమిండియాను మ్యాచ్‌లో నిలబెట్టింది.

రింకూ ఫినిషింగ్‌ టచ్‌
సంజు శాంసన్‌ అవుటైన తర్వాత.. టీమిండియా ఇన్నింగ్స్‌లో వేగం తగ్గింది. రుతురాజ్‌ సైతం హాఫ్‌ సెంచరీ పూర్తి అయ్యే వారకు నెమ్మదిగా ఆడాడు. ఫిఫ్టీ పూర్తి కాగానే.. వేగంగా ఆడే క్రమంలో ఓ సిక్స్‌ తర్వాత స్లోబాల్‌కు భారీ షాట్‌ ఆడే క్రమంలో క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో 129 పరుగుల వద్ద భారత్‌ 4వ వికెట్‌ కోల్పోయింది. దీంతో టీమిండియాకు ఆశించినంత స్కోర్‌ రాదనే విషయం స్పష్టమైంది. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 4 వికెట్ల నష్టానికి 145 పరుగుల మాత్రమే చేసింది. ఇక చివరి 12 బంతులు ఉన్నాయనే సమయంలో నయా సంచలనం సిక్సర్ల సింగ్‌ రింకూ సింగ్‌ చెలరేగిపోయాడు. ఐర్లాండ్‌ బౌలర్లో సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌గా ఉన్న మెకార్టీ బౌలింగ్‌ను చీల్చి చెండాడు. రెండు భారీ సిక్సులు, ఒక ఫోర్‌తో ఆ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. రింకూ చూసి ఇన్స్‌పైర్‌ అయిన శివమ్‌ దూబే సైతం చివరి ఓవర్‌ తొలి రెండు బంతులను భారీ సిక్సులుగా మలిచాడు. ఆ వెంటనే సింగిల్‌ తర్వాత స్ట్రైక్‌లోకి వచ్చిన రింకూ మరో భారీ సిక్స్‌తో విరుచుకుపడ్డాడు. కానీ, ఆ వెంటనే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్‌ అయ్యాడు. కానీ, అప్పటికే టీమ్‌ కోసం చేయాల్సిన పనిని అద్భుతంగా చేశాడు. కేవలం 20 బంతుల్లో 38 పరుగులు చేసి.. మరోసారి బెస్ట్‌ ఫినిషర్‌ అనిపించుకున్నాడు. రింకూ మెరుపు బ్యాటింగ్‌తోనే టీమిండియాకు అదనంగా 25 పరుగుల వరకు వచ్చాయనే చెప్పాలి. అది విజయం భారీ ప్రభావం చూపింది.

బుమ్రా బౌలింగ్‌
ఈ మ్యాచ్‌లో 186 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌.. టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. భారత్‌ లాంటి బలమైన బౌలింగ్‌ ఎటాక్‌ ఉన్న టీమ్‌పై ఆడుతూ.. 20 ఓవర్లు పూర్తిగా ఆడి 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసిందంటే మెచ్చకోవాల్సిన విషయమే. అయితే.. కొన్ని చోట్ల ఐర్లాండ్‌ బ్యాటర్లు ఆడుతున్న తీరు చూస్తే.. టార్గెట్‌ను ఛేదించేలా కనిపించారు. సరిగ్గా అలాంటి సమయంలోనే బుమ్రా ఎంట్రీ ఇవ్వడం ఐర్లాండ్‌ జోరుకు బ్రేక్‌ వేయడం చేశాడు. బుమ్రా బౌలింగ్‌కి వచ్చిన ప్రతిసారీ ఐర్లాండ్‌ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా 12, 17వ ఓవర్లు బుమ్రా బౌలింగ్‌ చేయకుంటే.. ఐర్లాండ్‌ కచ్చితంగా టార్గెట్‌కు చాలా దగ్గరగా వచ్చేంది. బుమ్రా 12వ ఓవర్‌లో 4 పరుగులు, 17 ఎవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో అయితే ఒక వికెట్‌ తీసి.. ఐదు బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. చివరి బంతికి కీపర్‌ సంజు శాంసన్‌ సరిగా బంతిని అందుకోకపోవడంతో బైస్‌ రూపంలో నాలుగు పరుగులు వచ్చాయి. మొత్తం మీద 4 ఓవర్లలో బుమ్రా కేవలం 15 రన్స్‌ మాత్రమే ఇచ్చి 2 వికెట్ల తీసుకున్నాడు.

కెప్టెన్సీ
ఇక మ్యాచ్‌లో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది బుమ్రా కెప్టెన్సీ గురించి. పేరుకు బుమ్రా తాత్కాలిక కెప్టెనే అయినా.. ఈ యువ జట్టును ఎంతో అద్భుతంగా నడిపించాడు. కచ్చితమైన ప్లానింగ్‌, సరైన బౌలింగ్‌ మార్పులతో ఐర్లాండ్‌ను గేమ్‌లోకి రాకుండా చేశాడు. యువ ఆటగాళ్లను ఎంకరేజ్‌ చేస్తున్న విధానం, గ్రౌండ్‌లో బుమ్రా వ్యవహారశైలి ఎంతగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆటగాళ్లు తప్పులు చేస్తున్నా.. చిరునవ్వుతోనే వారిని గైడ్‌ చేయడం సూపర్‌. పైగా తాను ఎంత గొప్ప బౌలర్‌ అయినా కూడా వెంటవెంటనే ఓవర్లు పూర్తి చేసి వికెట్ల కోసం చూడకుండా.. జట్టులోని బౌలర్లందరికీ అవకాశం ఇస్తూ.. తన అవసరం ఉంది అనుకంటేనే బౌలింగ్‌కు వస్తూ.. మంచి కెప్టెన్‌ అనిపించుకున్నాడు. మరి టీమిండియానికి ఈ నాలుగు ప్రధాన కారణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అప్పుడు చేయి అందిస్తారు.. కిందపడుతుంటే వదిలేస్తారు! పృథ్వీ షా షాకింగ్ పోస్ట్..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి