iDreamPost

సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు C/O రంగస్థలం – Nostalgia

సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు C/O రంగస్థలం –  Nostalgia

హీరోకు చెవులు సరిగా పనిచేయవు. హీరొయిన్ డీ గ్లామర్ వేషంలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది. కథ మొత్తం పల్లెటూరిలో ఎక్కడికి వెళ్ళకుండా ఒకేచోట సాగుతుంది. అప్పుడెప్పుడో 80ల కాలంలో చూసిన పల్లెటూరి ప్రెసిడెంట్ గెటప్ లో విలన్ అవతారం. టైటిల్ ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువగా కనిపిస్తోంది. అసలు దర్శకుడు సుకుమార్ తన రెగ్యులర్ స్టైల్ ని వదిలి ఇలాంటి ప్రయోగం ఎందుకు చేస్తున్నట్టు. పైగా బడ్జెట్ కూడా భారీగా ఖర్చు పెట్టిస్తున్నాడు. అనవసరంగా రిస్క్ అవుతుందేమో.

మూడేళ్ళ క్రితం రంగస్థలం షూటింగ్ మొదలయ్యాక వినిపించిన రకరకాల కామెంట్లు ఇవి. అప్పటిదాకా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ మాస్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ తేజ్ ఇలాంటి రోల్ ఒప్పుకున్నాడని తెలిసి ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు. కాని సుకుమార్ కు మాత్రమే తెలుసు సబ్జెక్టులో ఉన్న సత్తా. లాజిక్స్ వెతికే అవసరం లేకుండా స్ట్రెయిట్ నెరేషన్ తో ఓ మంచి స్టొరీని చెబితే ప్రేక్షకులు ఆదరించే తీరతారని తాను వేసుకున్న అంచనా తప్పలేదు. కాకపోతే ఊహించినదాని కన్నా చాలా చాలా ఎక్కువ ఫలితం వచ్చింది. అదే విజయ రహస్యం.

అనగనగా రంగస్థలం అనే పల్లెటూరు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ అన్నయ్య అక్కడ ప్రెసిడెంట్ చేసే అక్రమాలకు ఎదురు తిరిగి ప్రాణాలు కోల్పోతాడు. అప్పటిదాకా మోటార్లకు నీళ్ళు పట్టుకుంటూ సరదాగా తిరిగే చెవిటి తమ్ముడికి ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాదు.దీనికి కారణం ఎవరో తెలుసుకుని వాళ్ళ అంతం కోసం పంతం పూనుతాడు. ఈ ప్రయత్నంలో ఎన్నో సవాళ్ళు ఎడురుకుంటాడు. చివరికి అసలు హంతకుడిని పట్టుకుని ఎలా శిక్షించాడో అదే క్లైమాక్స్.

నిజానికిది చాలా మాములు కథ. ఇదే ఫార్ములాతో గతంలోనూ ఎన్నో సినిమాలు వచ్చాయి. కాని సుకుమార్ తన వైవిధ్యాన్నంత ట్రీట్మెంట్ లో చూపించాడు. 1985నాటి బ్యాక్ డ్రాప్ తీసుకుని అచ్చం అదే తరహాలో అనిపించే పల్లెటూరి వాతావరణాన్ని పునఃసృష్టించి సహజమైన పాత్రలతో అంతకంటే జీవమున్న సంభాషణలతో ప్రేక్షకులను రంగస్థలం అనే ఊరిలో మూడు గంటల సేపు ప్రయాణం చేయించినంత గొప్ప అనుభూతిని కలిగించాడు. చూసినవాళ్లకు సైతం చిట్టిబాబు, కుమార్ బాబు, రామలక్ష్మి, ప్రెసిడెంట్ ల మధ్య తాము తిరిగినట్టే అనిపించింది కానీ ఏదో సినిమా అనే భావన కలగలేదు. అందుకే మళ్ళీ మళ్ళీ థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది రంగస్థలం. నాన్ బాహుబలి రికార్డులను తన సొంతం అయ్యేలా చేసుకుంది.

ఈ సినిమా గురించి చెప్పుకుంటే అదో ప్రవాహమే అవుతుంది. ఊహకు అందని రీతిలో అసలు విలన్ గా ప్రకాష్ రాజ్ ని ప్రాజెక్ట్ చేసిన తీరు, ప్రెసిడెంట్ మీద తిరగబడి చిట్టిబాబు అన్నయ్య కుమార్ బాబు ఎన్నికలకు సిద్దపడటం, రంగమత్త-చిట్టిబాబుల మధ్య హృద్యమైన అనుబంధం, రాచరికపు వ్యవస్థలేని రోజుల్లోనూ ప్రెసిడెంట్ భూపతి లాంటి వాళ్ళు వ్యవస్థను తమ చెప్పుచేతల్లో పెట్టుకునే విధానం వెరసి ఎన్నో అంశాలు రంగస్థలం విజయం కీలక భూమిక పోషించాయి.అడుగడుగునా సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, తన కంటతో డైరెక్టర్ ఆలోచనని కెమెరాతో ఆవిష్కరించిన రత్నవేలు టాలెంట్, జుబ్లీ హిల్స్ లో రంగస్థలాన్ని తమ మాయాజాలంతో భువికి తెచ్చిన రామకృష్ణ, మౌనికల ఆర్ట్ వర్క్, కెరీర్ బెస్ట్ అనిపించేలా దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటలు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకటా రెండా రంగస్థలం గురించి పుస్తకమే రాయొచ్చు.

నిస్సందేహంగా రామ్ చరణ్ లోని అసలు నిజమైన నటుడిని బయటికి తీసుకొచ్చింది రంగస్థలమే. తన స్టామినాను ప్రూవ్ చేసింది మగధీర అయినప్పటికీ అది రాజమౌళి బ్రాండ్ ప్రోడక్ట్. కాని రంగస్థలం అలా కాదు. ఒక స్టార్ లోని యాక్టర్ బయటికి వస్తే ఎలా ఉంటుందో చరణ్ కు రంగస్థలం అలా నిలిచిపోయింది. ఆది పినిశెట్టి, సమంతా, అనసూయ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేష్ ఎవరికి వారు పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ప్రాధమిక కమర్షియల్ సూత్రాలను మర్చిపోకుండా కథలోని ఆత్మకు కట్టుబడి సినిమా తీస్తే ఎలా ఉంటుందో రంగస్థలం దానికి గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. రెండేళ్ళ క్రితం 2018లో మర్చి 30న విడుదలైన రంగస్థలం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెక్కుచెదరని స్థానాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ చెప్పింది కేవలం కొన్ని కారణాలు మాత్రమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి