iDreamPost

21 రోజుల కఠినమైన సవాళ్ళు 

21 రోజుల కఠినమైన సవాళ్ళు 

భారతీయ సినిమా పుట్టినప్పటి నుంచి ఎన్నడూ చూడని భయంకరమైన విపత్కాలం మొట్టమొదటిసారి ఎదురయ్యింది. ప్రకృతి వైపరిత్యాలు ఎదురైనప్పుడో ప్రమాదాలు జరిగినప్పుడో కొద్దిరోజులు పరిశ్రమ స్థంబించడం జరిగింది కాని ఇలా ఏకంగా నెల రోజులకు పైగా సర్వం మూతబడటం మాత్రం ఇప్పటిదాకా చూడలేదని తలలుపండిన అనుభవజ్ఞులు అంటున్నారు. నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ మరో 21 రోజులు లాక్ డౌన్ తప్పదని స్పష్టం చేయడంతో షూటింగులకు ఇప్పట్లో మోక్షం లేదనే క్లారిటీ వచ్చేసింది. 

మూతబడిన సినిమా హాళ్ళు ఇంకో మూడు వారాలకు పైగా తెరుచుకునే ఛాన్స్ లేదు. హీరోలు దర్శకులు నిర్మాతలతో మొదలుకుని జూనియర్ ఆర్టిస్టులు లైట్ బాయ్ ల దాకా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. మోడీ తన ప్రసంగంలో ఇరవై ఒక్క రోజులు అన్నారు కాని ఖచ్చితమైన తేదిని చెప్పలేదు. అంటే పొడిగించే అవకాశాలు కొట్టిపారేయలేం. ఇప్పుడు చాలా సినిమాలు రిలీజులు ఆగిపోయి ల్యాబుల్లో ఎదురుచూస్తున్నాయి. షూటింగ్ చివరిదశలో ఉన్నవి, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్నవి లెక్కబెట్టుకుంటూ పోతే ఇప్పట్లో తేలడం కష్టం. ఫిలిం చాంబర్ ఈ విషయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని సందిగ్ధ స్థితి నెలకొంది. 

ప్రస్తుతానికి ప్రభుత్వ ఆదేశాలు పాటించడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మేలో ఇదంతా కుదుటపడి మార్గం సుగమమైతే ఇప్పటికే క్యులో ఉన్న తెలుగుతో పాటు భారీ బాలీవుడ్ సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ మీద దాడి చేస్తాయి.  ఇదంతా ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అటుచూస్తే ఓవర్సీస్ లో సిచువేషన్ ఇప్పట్లో కుదుటపడేలా లేదు. అక్కడ మార్కెట్ ఓపెన్ కాకుండా పెద్ద హీరోల ప్రొడ్యూసర్లు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేరు.  ఈ విపరీత గందరగోళం ఇప్పట్లో తగ్గేది కాదు కాని అప్పటిదాకా ఈ ఖాళీ సమయాన్ని మన వాళ్ళు మంచి కథలు ఎంచుకోవడంలో, స్క్రిప్ట్ లను ఒకటికి రెండు సార్లు మెరుగుపరుచుకోవడం మీద దృష్టి పెడితే మంచిది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి