iDreamPost

2022 రివ్యూ 5 – డబ్బింగ్ సినిమాల దందా

2022 రివ్యూ 5 – డబ్బింగ్ సినిమాల దందా

ఒకప్పుడు టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల ఆధిపత్యం తీవ్రంగా ఉండేది . శంకర్, మణిరత్నం లాంటి దర్శకుల పుణ్యమాని రజనీకాంత్, సూర్య, విక్రమ్ టైపు హీరోలకు ఇక్కడ పెద్ద మార్కెట్ ఏర్పడింది. క్రమంగా వరసగ ఫ్లాపులు రావడంతో ఒకప్పటిలా ఇప్పుడు పరిస్థితి లేదు 2022లో వీటి ప్రోగ్రెస్ ఎలా ఉందో ముందు చూద్దాం. ‘కెజిఎఫ్ 2’ ఊహించినట్టే అంచనాలకు మించేసి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేసింది. మొదటి భాగానికి మించి అనేలా అంచనాలన్నీ దాటేసి సూపర్ సక్సెస్ అందుకుంది. అసలు ఆడుతుందా అనే అనుమానం మధ్య తక్కువ రేట్ కు అమ్ముడుపోయిన కమల్ హాసన్ ‘విక్రమ్’ అనూహ్య విజయం సాధించి మూడింతలు ఎక్కువ లాభం తెచ్చింది

అసలే పరిచయం లేని రిషబ్ శెట్టి ‘కాంతార’తో అంత సంచలనం సృష్టిస్తాడని ఎవరూ ఊహించలేదు. కేవలం రెండు కోట్లు వస్తే చాలనుకుంటే ఏకంగా యాభై కోట్ల గ్రాస్ ని దాటేసి మతులు పోగొట్టింది. రిస్క్ లేకుండా వచ్చిన ధనుష్ ‘తిరు’ డీసెంట్ రన్ తో లాభాలు ఇస్తే ‘777 ఛార్లీ’లో ఉన్న ఎమోషన్ మన ప్రేక్షకులను సైతం మెప్పించింది. ‘పొన్నియన్ సెల్వన్ 1’ తమిళంలో ఎంత విరగబడి ఆడినా ఇక్కడి జనాలు మాత్రం అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు. ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ’ ఉన్నంతలో బాగానే ఆడింది. కార్తీ ‘సర్దార్’ విపరీతమైన పోటీ మధ్య సర్ప్రైజ్ హిట్టు కొట్టింది. ధనుష్ మరో మూవీ ‘నేనే వస్తున్నా’ దారుణమైన కంటెంట్ తో ఫెయిల్ అయ్యింది

విశాల్ సామాన్యుడు,దుల్కర్ సల్మాన్ హే సినామిక, విజయ్ సేతుపతి కన్మణి రాంబో కతిజ, ప్రభుదేవా మై డియర్ భూతం, పునీత్ రాజ్ కుమార్ జేమ్స్, ఆర్య కెప్టెన్, బ్రేక్ ఈవెన్ అందుకోలేక చతికిలబడ్డాయి. బాలీవుడ్ దిగుమతులు రామ్ సేతు, సామ్రాట్ పృథ్విరాజ్, తోడేలు, లాల్ సింగ్ చద్దా, షంషేరా కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కు తేలేదు. విజయ్ బీస్ట్ గుడ్డిలో మెల్లలా ఎదురీదింది. శింబు లైఫ్ అఫ్ ముత్తు వారానికి చాప చుట్టేసింది. హాలీవుడ్ చిత్రాల్లో బ్లాక్ పాంథర్ వాకండ ఫరెవర్ ఓకే అనిపించగా అవతార్ 2 ది వే అఫ్ వాటర్ సెన్సేషన్ అయ్యింది. ఏడాది చివరిలో ట్రై చేద్దామని వచ్చిన నయనతార కనెక్ట్, విశాల్ లాఠీలు తోకముడిచాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి