iDreamPost

క‌డ‌ప‌లో ప్రభుత్వానికి 200 కోట్ల ఆదాయం

క‌డ‌ప‌లో ప్రభుత్వానికి 200 కోట్ల ఆదాయం

అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అవినీతి, అక్ర‌మాల‌ను అణ‌చివేస్తామంటున్న ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ ఆ రీతిలోనే ముందుకు పోతున్నారు. లంచాలు తీసుకున్న వారిని క‌ట్ట‌డిచేస్తూ అవినీతిని అంతం చేస్తూనే… నిబంధ‌న‌లు పాటించ‌ని వారిని అణ‌చివేస్తూ అక్ర‌మాల‌కు చెక్ పెడుతున్నారు. మొత్తం మీద అధికారం చేప‌ట్టిన ఏడాదిలో్పు అవినీతి, అక్ర‌మాలు లేని రాష్ట్రంగా ఏ.పిని నిల‌బెట్ట‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అక్ర‌మ లేఔట్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ వ్య‌వ‌హారంలో క‌డ‌ప జిల్లా నుంచి దాదాపు 200 కోట్ల‌మేర ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూర‌నుంది.

నిబంధ‌న‌ల‌కు తిలోద‌కాలిచ్చి అక్ర‌మంగా వేసిన లేఔట్ల‌ను స‌క్ర‌మ‌మం చేసేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో క‌డ‌ప జిల్లాలో రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 950 ఎక‌రాల్లో అక్ర‌మంగా లేఔట్లు ఉన్నట్లు అధికారుల ప‌రిశీల‌న‌లో తేలింది. ఈ భూముల‌కు రిజిస్ట్రేష‌న్లు చేసి స‌క్ర‌మ రీతిలోకి మారిస్తే ప్ర‌భుత్వానికి రూ. 200 కోట్లు ఆదాయం రానుంది.

క‌డ‌ప కార్పోరేషన్‌తో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల, జ‌మ్మ‌ల‌మడుగు, రాజంపేట‌, బ‌ద్వేలు, ఎర్ర‌గుంట్ల‌, మైదుకూరు, రాయ‌చోటి పుర‌పాలిక‌ల్లో అక్ర‌మ లేఔట్లు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల‌న్నింటిలో అక్రమంగా లేఔట్లు వేసి కోట్లు సంపాదించుకునేందుకు కొంద‌రు అక్ర‌మార్కులు ప్ర‌య‌త్నించారు. అయితే తాజాగా ప్ర‌భుత్వం వీటిని కూడా క్ర‌మ‌బ‌ద్దీక‌రించుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది.

మామూలుగా వ్య‌వ‌సాయ భూమిలో ప్లాట్లు వేయాలంటే ముందుగా ఒక ద‌ర‌ఖాస్తు పెట్టి త‌మ భూమిని ప్లాట్లు వేసుకునేందుకు అనుమతి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి ప‌న్ను క‌ట్టాలి. ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ స‌రిగ్గా ఉంటే అధికారులు విచార‌ణ చేసి వ్య‌వ‌సాయ భూమిని వ్య‌వ‌సాయేత‌ర ప‌నులు చేసేందుకు అనుమ‌తులు ఇస్తారు. అయితే కొన్ని వంద‌ల ఎక‌రాల్లో భూముల‌ను అక్రమార్కులు నిబంధ‌న‌లు ఉల్లంఘించి లేఔట్లు వేసి విక్ర‌యిస్తున్నారు.

దీని ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిప‌డుతోంది. ఇప్పుడు ప్రభుత్వం జీవో ఎం.ఎస్ నం 10 అమ‌లు చేస్తుంది. దీని వ‌ల్ల ఈ అక్ర‌మ లేఔట్లు వేసిన చోట స్థ‌లాల రేట్లు త‌గ్గాయి. అంతేకాకుండా నిబంధ‌న‌లు పాటించ‌డంతో క‌ట్టే ప‌న్నుల ద్వారా ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూర‌నుంది. రిజిస్ట్రేష‌న్ నిలిపివేసిన వాటిలో ఇప్పుడు అధికారికంగా అనుమ‌తులు తీసుకుంటారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఖాలీ స్థలం ఉంటే 7శాతం, 10 శాతం ఎల్‌.ఆర్‌.ఎస్ ప‌న్నులు క‌ట్టాలి. దీని ద్వారా ఒక్క క‌డ‌ప జిల్లాలోనే రెండు వందల కోట్ల రూపాయ‌లు ఆదాయం రానుంది. ఇక ప్లాట్లు వేసుకున్న వారు ఆ స్థ‌లంలో ప‌ది శాతం స్థ‌లాన్ని పురపాలిక‌కు ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వారా మొత్తం 95 ఎక‌రాల స్థ‌లం ప్ర‌భుత్వ ఆదీనంలోకి వ‌స్తుంది.

అక్ర‌మంగా ఉన్న‌ లేఔట్లు క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ కోసం ప్రభుత్వం ఆరు నెల‌లు స‌మ‌యం మాత్ర‌మే ఇచ్చింది. గ‌డువులో 45 రోజుల్లోపు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ప‌ది శాతం, 90 రోజుల్లో ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 5 శాతం చెల్లించాల్సిన ప‌న్నులో రాయితీ ఇస్తారు. అక్ర‌మ లేఔట్ల ద్వారా కోట్ల రూపాయ‌లు సంపాదించాల‌న్న అక్ర‌మార్కులు ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డారు. లక్ష‌ల రూపాయలు ప‌న్నులు క‌ట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు. అయితే క్ర‌మ‌బ‌ద్దీక‌రించుకోక‌పోతే జ‌రిమానాలు భారీగా వేసేందుకు అధికారులు సైతం సిద్ధ‌మ‌వుతున్నారు. మొత్తం మీద వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అవినీతి అక్ర‌మాల‌పై దృష్టి పెట్టింది. లంచాలు తీసుకునే అధికారుల‌పై విరుచుకుప‌డుతూ అవినీతిని అంతం చేస్తూనే.. ఇలా నిబంధ‌న‌లు పాటించ‌ని లేఔట్ల‌కు షాక్ ఇస్తూ అక్ర‌మాల‌ను అరిక‌డుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి