iDreamPost

జంతువులు లేవు కానీ.. 20 కోట్లు పెట్టి బోన్లు కొన్నారు.. అధికారుల నిర్వాకం

జంతువులు లేవు కానీ.. 20 కోట్లు పెట్టి బోన్లు కొన్నారు.. అధికారుల నిర్వాకం

ఎనకటికి ఎవడో ఒక వ్యక్తి బర్రెను కొనకముందే దానికి ఓ తాడు కొన్నాడంట.. బృహాన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు చేసిన పని కూడా అచ్చం అలానే ఉంది. ముంబై ఉన్న ప్రసిద్ధ జూ బైకుల్లాలో జంతువులను ఉంచేందుకు రూ.20 కోట్లు ఖర్చు పెట్టింది. ఎందుకంటే రూ.20 కోట్లు ఖర్చు పెట్టి.. జంతువులను ఉంచేందుకు అధునాతన ఎన్‌క్లోజర్లను కొనుగోలు చేశారు. అయితే ఏ జంతువులను కోసం అయితే ఎన్‌క్లోజర్లను కొనుగోలు చేశారో సదరు జంతువులు ఆ జూలోనే లేకపోవడమే అందరిని అశ్చర్యానికి గురి చేస్తోంది. ఆర్టీఐ యాక్ట్ కింద విజిల్‌ బ్లోయర్స్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన దరఖాస్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసిన వివరాల ప్రకారం.. సింహాలను ఉంచే  బోన్ల కోసం రూ.8.25 కోట్లు ఖర్చు పెట్టారు. అలానే తోడేళ్ల కోసం రూ. 7.15 కోట్లు ఖర్చు పెట్టి ఎన్ క్లోజర్ ను కొనుగోలు చేశారు. నీటి పిల్లుల కోసం రూ.3.82 కోట్లను బీఎంసీ అధికారులు ఖర్చుచేశారు. ఈ విషయం తెలిసిన ముంబై ప్రజలు బీఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక లేకుండా ఇలా.. లేని జంతువుల కోసం బోన్‌లను నిర్మించడమంటే ధనాన్ని దుర్వినియోగం చేయడమేంటనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై బీఎంసీ అధికారులు స్పందించి.. ఓ క్లారిటీ ఇచ్చారు.

భవిష్యత్ లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా ఎన్‌క్లోజర్లను కొనుగోలు చేశామని తెలిపారు. ముందే కొనుగోలు చేయకపోతే రాబోయే రోజుల్లో  స్టెయిన్‌లెస్‌ స్టీల్, కాంక్రీట్‌, ఇతర నిర్మాణ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అందుకే జంతువు ప్రదర్శన శాలపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో ముందుగానే వాటిని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. అసలే చేసింది మోసం కాగా.. దాన్ని కవర్ చేసేందుకు చెప్పిన సాకులు కూడా ఇప్పుడు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మరి.. బీఎంసీ అధికారుల నిర్వాకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి