iDreamPost

పవన్ పాట వెనుక 12 మెట్ల కిన్నెర

పవన్ పాట వెనుక 12 మెట్ల కిన్నెర

ఇవాళ విడుదలైన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఆన్ లైన్ వేదికగా సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం గంటల వ్యవధిలో అర మిలియన్ల వ్యూస్ దాటేసి కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. ఇందులో పాట మొదట్లో పవన్ పాత్ర పరిచయం చేస్తూ ఓ వాద్యకారుడు పాడే పల్లవి అందరనీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయనెవరో దర్శకుడు సాగర్ కె చంద్ర సెట్ చేసిన ఆర్టిస్టు అనుకుంటే పొరపాటే. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆయన పేరు దర్శనం మొగిలయ్య. ఆ కళాకారుడికి మాత్రమే సొంతమైన అద్భుతమైన ప్రతిభతో ఓ ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తారు. తన కళను పదుగురు మెచ్చేలా పరిచయం చేస్తూనే ఉంటారు.

పన్నెండు మెట్ల కిన్నెర అనేది మొగిలయ్య వాడే వాయిద్యం పేరు. ఈయన స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట గ్రామం. ఈయన పూర్వీకుల నుంచి ఈ అరుదైన విద్య మొగిలయ్యకు అబ్బింది. ఇంటి పేరే కిన్నెరగా మారిపోయేలా తెలంగాణలో ప్రతి జానపద గ్రామీణ సంగీత ప్రేమికులకు చేరువయ్యారు. ఎద్దు కొమ్ములు, అద్దాలు, తీగలు, మైనం, తేనే, సొరకాయలు, వెదురు కర్ర తదితరాలు ఉపయోగించి ఈ వాద్యాన్ని తయారు చేశారు మొగిలయ్య తాతల కుటుంబీకులు. వాళ్ళు 11 మెట్లు మాత్రమే చేసి ఇకపై జోడించడం అసాధ్యమని తేల్చేస్తే పద్దెనిమిదేళ్ల వయసులోనే పన్నెండో మెట్టు జత చేసి అబ్బురపరిచారు

కిన్నెర మొగిలయ్య చదువు స్వల్పమే అయినా తెలంగాణ చరిత్ర, వీర గాథలు ఆయన మెదడులో నిక్షిప్తం. వాటినే పాటలుగా మార్చుకుని పాడేవారు. అప్పటి సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చెప్పడంలో పెట్టింది పేరు. ఈ పన్నెండు మెట్ల కిన్నెర తెలంగాణ ఎనిమిదో తరగతి పాఠ్యాంశంలో ఉందంటేనే ఇది ఏ స్థాయిలో జనాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రత్యేకంగా డాక్యుమెంటరీ కూడా రూపొందించింది. జీవనోపాధి కోసం చిన్న పనులను సైతం చేయడానికి వెనుకాడని మొగిలయ్య ఏనాడూ కాసుల కోసం పాకులాడని అరుదైన వ్యక్తిత్వం. ఇప్పుడు భీమ్లా నాయక్ పాట రూపంలోనైనా ప్రపంచానికి మరింతగా తెలియడం అవసరం

Also Read : మార్పుల చక్రవ్యూహం లో తమన్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి