iDreamPost

పేదలను ఆదుకుంటున్న డాక్టరమ్మ.. కేవలం రూ.10 ఫీజుతో వైద్యం!

పేదలను ఆదుకుంటున్న డాక్టరమ్మ.. కేవలం రూ.10 ఫీజుతో వైద్యం!

మనిషికి డబ్బు కంటే ప్రధానమైనది ఆరోగ్యం. అది సరిగ్గా లేకుంటే ఎంత డబ్బు ఉన్న వ్యర్థమే. ఎప్పుడైనా అనారోగ్య బారిన పడితే.. చికిత్స కోసం ఆస్పత్రుల్లో భారీగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఏదైనా క్లిష్టమైన అనారోగ్య సమస్య అయితే లక్షాల డబ్బులు చికిత్స కోసం వెచ్చించాల్సి ఉంటుంది.  ఇంకా దారుణం ఏమిటంటే నేటి కాలంలో వైద్యం అనే ఓ వ్యాపారంగా మారిపోయింది.  సామాన్యుల నుంచి అందిన కాడికి డబ్బులు రాబట్టే ప్రయత్నం చాలా ఆస్పత్రులు చేస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థలో కూడా ఓ యువ వైద్యురాలు కేవలం 10 రూపాయల ఫీజుతో వైద్యం అందిస్తుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

విజయవాడకు చెందిన నూరి పర్వీన్.. కడప ప్రాంతంలో వైద్య విద్యను అభ్యసించింది.  వైద్యవిద్య చదివే సమయంలో కడప ప్రాంతం, అక్కడి ప్రజలతో నూరి పర్వీన్ కు మంచి బంధం ఏర్పడింది. ఆ కారణంతో ఊరిని కాదని కడప ప్రాంతంలోనే వైద్యం అందిస్తుంది. ఆమె తల్లిదండ్రులు విజయవాడలోనే ఉంటారు. తాను మాత్రం కడపలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఓ క్లినిక్ ను ప్రారంభించింది. నూరి పర్విన్ కడపలోని పేద ప్రజలకు కేవలం రూ.10 ఫీజుతోనే వైద్య సేవలు అందిస్తున్నారు. క్లినిక్ లో వైద్య సేవలు అందిస్తూనే ఇతర సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాలుపంచుకున్నారు.  ఎంబీబీఎస్ చదువు కోసం కడపలో అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు ఆ నగరంలో చాలామందికి సుపరిచితురాలిగా మారారు.

ఎక్కువ మంది ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల మీద అనుమానాలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం తమ వల్ల కాదన్న అభిప్రాయంలో ఉన్నారని  పర్వీన్ అభిప్రాయపడ్డారు. అందుకే తన క్లినిక్‌లో రూ.10కే వైద్యం అందిస్తున్నానని చెప్పారు.  భవిష్యత్తులో పెద్ద ఆసుపత్రి కట్టి రూ.10కే వైద్యం అందించాలనేది తన లక్ష్యమని ఆమె అన్నారు. ఎంబీబీఎస్‌లో చేరడానికి ముందు నుంచే పర్వీన్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. వైద్య విద్యార్థినిగా ఉన్నప్పుడు కడప రిమ్స్‌లో సైతం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నేటికాలంలో విద్యా, వైద్యం ఖరీదుగా మారిపోయాయని, వీటి విషయంలో ప్రజలకు ఎంత సేవ చేసినా తక్కువేనని  నూరి పర్వీన్ అంటున్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ..” కార్పోరేట్ ఆస్పత్రుల మెట్లు ఎక్కడానికి సామాన్య ప్రజలు భయపడుతుంటారు. వేలు, లక్షల ఫీజులు చెల్లించే స్థోమత లేక  ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. అందుకే రూ.10 ఫీజు తీసుకుంటూ వారికి అండగా నిలబడుతున్నాను. నేటికాలంలో రూ. 10 అంటే ఎవరికీ భారం కాదు. కడప ప్రాంతంలో డాక్టర్ వైఎస్సార్, డాక్టర్ కమల్ పాషా వంటి వారు ఒక్క రూపాయికే చికిత్స చేశారని విన్నాను. పేద ప్రజలకు సేవ చేస్తే నాకు కూడా చరిత్రలో చోటు దక్కుతుందని భావిస్తున్నాను. మా తాతయ్య  పేరు మీద ఏర్పాటు చేసిన ‘నూర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు’ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను” అంటూ పర్వీన్ వివరించారు. మరి.. ఈ పది రూపాయల డాక్టరమ్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి