iDreamPost

మంచి సినిమాకు పబ్లిసిటీ అక్కర్లేదా..?

మంచి సినిమాకు పబ్లిసిటీ అక్కర్లేదా..?

నిన్న అజిత్ ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. కంటెంట్ ఉన్న మంచి సినిమాకు ప్రమోషన్లు అక్కర్లేదని చెప్పడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారి తీసింది. సంక్రాంతికి రాబోయే తన కొత్త చిత్రం తునివుకి తన సైడ్ నుంచి ఎలాంటి పబ్లిసిటీ ఉండదని చెప్పేందుకు ఈ కామెంట్ చేశారనే అనుమానం వస్తోంది. కాసేపు ఆయన గురించి పక్కన పెడితే నిజంగానే విషయమున్న మూవీకి ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఉందా అంటే దీని గురించి కాస్త విశ్లేషణ చేసుకోవాలి. ఇది మార్కెటింగ్ ప్రపంచం. మనం తయారు చేసే వస్తువు ఎంత అద్భుతంగా ఉన్నా దాన్ని నలుగురు కొనాలంటే ముందు అదుందన్న సంగతి చెప్పాలి, వందల వేల మంది ప్రభావితం చెందేలా వాణిజ్య ప్రకటనలు తీయాలి.

అంత పెద్ద యాపిల్ ఐఫోన్ సంస్థ యాడ్స్ చేయకపోవడం ఎప్పుడైనా చూశామా. లక్షల కోట్ల రూపాయలతో వ్యాపారం చేసే హిందుస్తాన్ యునీ లివర్ తన వేలాది ఉత్పత్తులకు అన్ని రకాల భాషల్లో నిత్యం ప్రకటనలు ఇస్తూనే ఉంటుంది. సినిమా కూడా అంతే. రాజమౌళి జపాన్ ఎందుకు వెళ్ళాడు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందు చరణ్ తారక్ లను వెంటేసుకుని దేశం మొత్తం కాళ్లకు చక్రాలు కట్టుకుని ఎందుకు తిరిగాడు. కాంతార తెలుగులో గొప్ప విజయం అందుకుందని తెలిసిన వెంటనే రిషబ్ శెట్టి బెంగళూరు కంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడమే కాదు ఏపీ తెలంగాణ ప్రధాన నగరాల్లో థియేటర్ టూర్లు చేసి తిరుగుతూనే ఉన్నాడు.

సీతారామం, కార్తికేయ 2 బృందాలు ముంబై, ఢిల్లీ, చెన్నై తదితర సిటీస్ ని ప్రదక్షిణాలు చేయడానికి కారణం ప్రచారం కోసమేగా. ఇక్కడ చెప్పినవన్నీ బ్లాక్ బస్టర్లే. మార్నింగ్ షోకే సినిమా చాలా బాగుందని టాక్ తెచ్చుకున్నవే. అయినా సదరు టీమ్లు ఎక్కడా నిర్లిప్తంగా వ్యవహరించలేదు. ఎంత బలమైన విషయమున్నా సరే జనం నోళ్ళలో నానుతూ ఉండాలంటే ఇవన్నీ తప్పదు. అంతెందుకు అజిత్ వలిమై వచ్చినప్పుడు ఇక్కడెవరూ పట్టించుకోలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన రాలేదు. దర్శకుడు హీరోయిన్ వచ్చి ఏదో మేనేజ్ చేశారు ఫైనల్ గా బొమ్మ ఫ్లాప్ అయ్యింది. నేను నటించాను అక్కడితో నా పనైపోయిందనుకుంటే సరే అనుకునే కాలం కాదిది. వంట చేసేవాడే అమ్మిపెట్టాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి