iDreamPost

బాబు మళ్లీ ఏసేశాడు..ఎన్టీఆర్ ని తానే గట్టెక్కించారట!

బాబు మళ్లీ ఏసేశాడు..ఎన్టీఆర్ ని తానే గట్టెక్కించారట!

టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయనతో సామాన్యంగా ఉండదు. హైదరాబాద్ ని నిర్మించడం నుంచి క్లింటన్ ని గెలిపించడం వరకూ అన్నింటికీ ఆయన ఆద్యుడిని అంటారు. అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేయడం నుంచి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచపటంలో పెట్టడం వరకూ అంతా తనవల్లనే అంటారు. తాజాగా మరోమారు అలాంటి వ్యాఖ్యలు చేసి చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరాన్ని తీసుకొచ్చారు.

చంద్రబాబునాయుడి రాజకీయజీవితం కాంగ్రెస్ తో మొదలయ్యిందన్నది అందరికీ తెలిసిన సత్యం. చివరకు ఎన్టీఆర్ కూతురిని పెళ్లిచేసుకున్న తర్వాత కూడా టీడీపీ వ్యవస్థాపకుడిపై తీవ్రవ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకే చెల్లింది. 1983 ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి చంద్రబాబు టీడీపీచేతిలో ఓటమిపాలయిన సంగతి కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది. కానీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. దానికి కాంగ్రెస్ నాయకత్వం మద్ధతుగా నిలిచింది. చివరకు నాటి గవర్నర్ రామ్ లాల్ ఇచ్చిన అవకాశంతో నాదెండ్ల టీడీపీ తిరుగుబాటు నేతగా ముఖ్యమంత్రి పీఠం కూడా ఎక్కారు. ఇదంతా ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత ఏడాదికే జరిగింది.

అప్పటికి చంద్రబాబు ఇంకా టీడీపీలో చేరలేదు. పైగా టీడీపీలో అప్పటికి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుయువత అధ్యక్షుడి హోదాలో చక్రం తిప్పుతున్నారు. ఎన్టీఆర్ ని గద్దెదింపి నాదెండ్లను సీఎం పీఠం మీద కూర్చోబెట్టిన తర్వాత వాస్తవానికి రాజకీయ అనుభవంలేని టీడీపీలోని కీలక నాయకత్వం చేతులుడిగి కూర్చోవాల్సి వచ్చింది. అప్పటికే ఇందిరాగాంధీ హవా సాగుతుండడం, నాదెండ్ల పీఠం మీద ఉండడంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరింది. ఆ సమయంలో దేశంలోని కాంగ్రెస్ వ్యతిరేకపక్షాలన్నీ ఈ పరిణామం పట్ల స్పందించాయి. ఎన్టీఆర్ కి బాసటగా నిలిచాయి. ముఖ్యంగా బెంగాల్ సీఎంగా ఉన్న జ్యోతిబసు, కశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, రామకృష్ణ హెగ్డే, వాజ్ పాయ్ వంటి వారు సీన్లోకి వచ్చారు. ఏపీలో ప్రభుత్వాన్ని కూలదోయడంలో కాంగ్రెస్ అధిష్టానానిదే కీలకపాత్ర అని, ఇది రాష్ట్రాల హక్కులను, ప్రజాతీర్పును ఉల్లంఘించడమేనని పెద్ద స్థాయిలో నిరసనలకు పూనుకున్నారు.

దేశవ్యాప్తంగా లభించిన రాజకీయ అండతో ఎన్టీఆర్ మళ్లీ ఉత్తేజితమయ్యి ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో యాత్రలు ప్రారంభించారు. రాష్ట్రమంతా మళ్లీ టీడీపీకి పునరుత్తేజం వచ్చింది. చివరకు నాదెండ్ల ప్రభుత్వం కుప్పకూలింది. రాష్ట్రపతిపాలన తర్వాత మళ్లీ 1985లో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఊపు ఉంటుందని గ్రహించిన చంద్రబాబు టీడీపీ పక్షాన చేరినట్టు దగ్గుబాటి తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన చేరికను చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు అభ్యంతరం పెట్టినా కూతురు మీద ప్రేమతో ఎన్టీఆర్ ఆహ్వానించారని దగ్గుబాటి రాశారు. అయినా చివరకు పదేళ్లు తిరగకముందే 1995లో ఎన్టీఆర్ మీద సరిగ్గా నాదెండ్ల బాటలోనే చంద్రబాబు తిరుగుబాటు చేసి మామను పదవీచ్యుతుడిని చేసిన చరిత్ర కూడా ఏపీ రాజకీయాల్లో చెరిగిపోని జ్ఞాపకం. కొద్దికాలానికే ఈ బెంగతో ఎన్టీఆర్ మరణించడం విషాదకర ఘటన.

తాజాగా తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి 44 ఏళ్లు గడిచిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో 1984లో టీడీపీ సంక్షోభంలో తనదే కీలకపాత్ర అంటూ చంద్రబాబు చెప్పుకోవడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. రాజకీయంగా తన పాత్రలేని చోట కూడా అంతా నేనే అని చెప్పుకోవడం బాబు నైజం అని సరిపెట్టుకుంటే, టీడీపీ ఆవిర్భావానికి కూడా తానే మూలం అని చెప్పుకోవడానికి సంకోచించని మనస్తత్వంలా కనిపిస్తోంది. రాజకీయ పార్టీ పెట్టాలని తానే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఎన్టీఆర్ కి చెప్పానని కూడా చంద్రబాబు వల్లించే రోజులు ఎంతో దూరంలో లేనట్టుగా కనిపిస్తోంది. పైగా బాబు చెప్పిన మాటలన్నీ నమ్మేసి నిజమేనని అచ్చులేసే మీడియా ఉండడంతో జనాలను మభ్యపెట్టే ప్రయత్నాలకు హద్దూ,అదుపు లేనట్టుగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి