iDreamPost

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా

అందరూ భయపడినట్లే జరిగింది. గత కొంత కాలంగా ఉక్రెయిన్, రష్యాల మధ్య మొదలైన యుద్ధ వాతావరణం.. ఈ రోజు కార్యరూపం దాల్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. సైనిక ఆపరేషన్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. పౌరులను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొద్దిసేపటి క్రితం టెలివిజన్‌ ద్వారా ప్రజలనుద్దేశించి మాట్లాడిన పుతిన్‌.. ఉక్రెయిన్‌ నుంచి ఎదురవుతున్న ముప్పుకు స్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలనేది తమ లక్ష్యం కాదని పుతిన్‌ స్పష్టం చేశారు. రక్తపాతానికి ఉక్రెయిన్‌ పాలకులదే బాధ్యతని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల వద్ద గత కొన్ని రోజులుగా రష్యా తన బలగాలను మోహరిస్తోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న అమెరికా, జపాన్, ఇంగ్లాడ్, యూరప్‌ దేశాలు.. రష్యాను నిలువరించేందుకు పలు ప్రకటనలు చేశాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై తాము చేపట్టిన చర్యల్లో ఎవరైనా తలదూరిస్తే.. ఇది వరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుందని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

పుతిన్‌ ప్రకటన వెంటనే.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో పేలుడు సంభవించింది. ఈ రోజు ఉదయం నుంచి రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మూడు వైపులా రష్యా బలగాలు చుట్టుముట్టాయి. తాజాగా కీవ్‌లోని విమానాశ్రయాన్ని రష్యా బలగాలు ఆక్రమించాయి.

రష్యాకు ధీటుగా బదులిచ్చేందుకు ఉక్రెయిన్‌ కూడా సిద్ధమైంది. రష్యాకు తగ్గేదేలేదని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌క్కి ప్రకటించారు. దేశంలో నెల రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

కాగా, రష్యా చర్యలపై అమెరికా సహా ఇతర దేశాలు స్పందించాయి. రష్యాపై ఆర్థిక ఆంక్షలు వి«ధిస్తున్నట్లు ప్రకటించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమైంది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న యుద్ధం నిలువరించేందుకు సమాలోచనలు జరుపుతోంది.

రష్యాపై యుద్ధం చేయబోమని అమెరికా ప్రకటించింది. అయితే రక్షణ చర్యల్లో భాగంగా బలగాలను సిద్ధం చేస్తున్నామని తెలిపింది. రష్యా చేసే దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణ నష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసింది. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఐక్యమత్యంతో దీనికి నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. రష్యాను ప్రపంచం బాధ్యల్ని చేస్తుందని హెచ్చరించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి