iDreamPost

కష్టాలున్నా..సంక్షేమం ఆగదు..నేడు మహిళల ఖాతాకి లో 1,400 కోట్లు..

కష్టాలున్నా..సంక్షేమం ఆగదు..నేడు మహిళల ఖాతాకి లో 1,400 కోట్లు..

నెల రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గమే లేదు. అయినా సరే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంక్షేమాన్ని మాత్రం ఆపడం లేదు. కష్టాలున్నా, నష్టాలున్నా ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళుతోంది. తాజాగా డ్వాక్రా మహిళల కోసం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెర్ఫ్, మెప్మా పరిధిలో ఉండే గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని 8,78, 874 పొదుపు సంఘాల్లో ఉండే 90,37,254 మంది మహిళలకు వారి ఖాతాల్లో 1,400 కోట్లు ఒకే సారి జమ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఏ పొదుపు సంఘానికి ఎంత వడ్డీ డబ్బులు జమ అయిందనే వివరాలను అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు స్థానిక సెర్ఫ్, మెప్మా అధికారుల ఫోన్‌ నంబర్లను సభ్యులకు అందజేస్తారు.

పథకం పూర్వాపరాలివీ..
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో డ్వాక్రా మహిళల కోసం మొదట పావలా వడ్డీ పథకం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పావలా వడ్డీని కూడా తీసేసి.. సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. వైఎస్సార్‌ ఉన్నంతకాలం ఈ పథకం అద్భుతంగా కొనసాగింది. ఆయన మరణించిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకంపై చిన్న చూపు చూశాయి. చంద్రబాబు హయాంలో 2016లో ఈ పథకానికి పూర్తిగా నిధులు ఆపేశారు. దీంతో అప్పటివరకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తూ ఏ గ్రేడ్‌లో ఉన్న పొదుపు సంఘాలు బీ, సీ గ్రేడ్‌లకు పడిపోయాయి. ఈ క్రమంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది డ్వాక్రా మహిళలు తమ కష్టాలను ఆయనకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాను సీఎం కాగానే మళ్లీ సున్నా వడ్డీ పథకాన్ని పునఃప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నేడు సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి