iDreamPost

సెటైర్లు.. వ్యంగ్యాస్త్రాలు.. ప్ర‌సంగాల్లో స్టైల్ మార్చిన జ‌గ‌న్

సెటైర్లు.. వ్యంగ్యాస్త్రాలు.. ప్ర‌సంగాల్లో స్టైల్ మార్చిన జ‌గ‌న్

ఇటీవల కాలంలో జగన్ ప్రసంగం స్టైల్ మారింది. సందర్భోచితంగా ప్ర‌తిప‌క్షాల‌పై సెటైర్లు వేయడంలోనూ, కామెంట్లు చేయడంలోనూ ముందు వ‌రుస‌లో ఉంటున్నారు. తెలుగు రాష్ర్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ది అదే స్టైల్ . ఆయన మీడియా ముందుకు వచ్చినా.. సభలో ప్రసంగం చేసినా పిట్టకథలు, సామెతలతో ఆకట్టుకుంటారు. తొలిసారి సీఎం అయిన జగన్ కూడా వినూత్న స్టైల్ లో జ‌నాన్ని ఆక‌ట్టుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పైనా అవకాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా సెటైర్లు వేస్తున్నారు.

గ‌తంలో నామినేటెడ్ పదవుల వ్యవహారంలో మాట్లాడుతూ.. చంద్రబాబును ఇరుకున పెట్టే రీతిలో సెటైర్ వేశారు. నామినేట్ పోస్టులన్నింటినీ ప్రభుత్వం ఒకే వర్గానికి కట్టబెట్టారంటూ టీడీపీ ఆరోపించింది. అయితే, దీనిని జగన్ తిప్పికొట్టారు.నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించామని చెప్పి, ఆ జాబితాను సభ ముందుంచారు. అలాగే కేబినెట్ లో సైతం అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించామని పేర్కొన్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల్లో చంద్రబాబు అత్తగారికి కూడా అవకాశం కల్పించామని.. ఆమెను తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమించామని జగన్ వ్యాఖ్యానించారు. అలాగేమహిళా భద్రత బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకూ ఇద్దరు ఆడపిల్లలున్నారని, ఒక చెల్లెలు ఉందని, భార్య ఉందని చెప్పి.. ఒక్కరే భార్య అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశంచి పరోక్షంగా వ్యాఖ్యానించడంతో సభ నవ్వులతో నిండిపోయింది. ఆరోగ్య శ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్సలు ఉన్నాయని పేర్కొంటూ వయసు మళ్లితే చికిత్స ఉంటుంది.. కానీ మెదడు మళ్లితే చికిత్స లేనే లేదని అన్నారు. అలాగే ఆసూయతో వచ్చే కడుపుమంటకు, అక్క‌సుతో ఉండేవారిని బాగుచేసే మందులు ఎక్కడా లేవంటూ సెటైరిక‌ల్ గా మాట్లాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

తాజాగా.. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ పథకం మూడో విడత నిధులు, రైతులకు పెట్టుబడి సాయం, నివర్‌ తుపాను నష్ట పరిహారం చెల్లింపు క్యార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నివర్ నష్టపరిహారం ఇస్తామని ఇప్పటికే పలుమార్లు చెప్పామని సీఎం గుర్తు చేశారు. అయినా కూడా చంద్రబాబు ప్రతిపక్షనేతగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పుత్రుడిని, దత్తపుత్రుడిని ఒక్క రోజు ముందు చంద్రబాబు రోడ్డు మీదకు పంపారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జూమ్‌కు దగ్గరగా.. భూమికి దూరంగా ఉంటున్నారని సీఎం జగన్‌ సెటైర్లు వేశారు. వక్రబుద్ధితో ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచిందని అన్నారు. కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని.. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ చెప్పిందని సీఎం తెలిపారు. ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్స్, విద్యుత్ బకాయిలు, సున్నా వడ్డీ రుణాలను చంద్రబాబు ఎగ్గొట్టారని విమర్శించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించామని ఈ సందర్భంగా సీఎం జగన్‌ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 434 కుటుంబాలకు సాయం చేశామని చెప్పారు. దాంతోపాటు గత ప్రభుత్వం పెట్టిన సున్నా వడ్డీ బకాయిలు రూ.904 కోట్లు తీర్చామని సీఎం తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి