iDreamPost

అమరావతి’ విషయం ముందే చెప్పారుగా.. మళ్ళీ హడావుడి ఎందుకు?

అమరావతి’ విషయం ముందే చెప్పారుగా.. మళ్ళీ హడావుడి ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత 2020వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు. అయితే ఆ బిల్లును కొన్ని కారణాలతో వెనక్కి తీసుకున్నారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ చేసుకుని ఆ బిల్లును మరోసారి ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అప్పటి దాకా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అనే రికార్డులలో ఉంటుంది.

దీంతో ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించిన విషయంలో అమరావతి పేరుతో ప్రొవిజన్‌ పెట్టింది. దాని ప్రకారం సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లు అంచనా వ్యయంగా పేర్కొన్న కేంద్రం, ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాలకోసం రూ.1,126 కోట్లుగా అంచనా వేసింది. 300 ఏజీ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.200 కోట్లు అంచనా వ్యయంగా కేంద్రం నిర్ధారించింది. అయితే ఇది చూసి ఇంకేదో జరిగిపోతోంది అన్నట్టు అమరావతి పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుందని అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ.. 2022-23 బడ్జెట్‍లో కేంద్రం కేటాయింపులు చేసిందని టీడీపీ అనుకూల మీడియా హడావుడి మొదలుపెట్టింది.

అయితే నిజానికి ఈ విషయం మీద గతంలో రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. అదేమంటే రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే అని గతంలో ఒక ప్రశ్నకు సమాధానంగా నిత్యానంద రాయ్ తేల్చి చెప్పారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానుల బిల్లు ప్రవేశపెడితే ఆ కొత్త బిల్లు ప్రకారం ప్రకటించిన ప్రాంతాలనే రాజధానిగా గుర్తిస్తామని వెల్లడించారు. అంతటి దానికి ఈ విషయం మీద కేంద్రం గుర్తించింది అంటూ ప్రచారం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి