iDreamPost

బీసీ సదస్సులకు సన్నాహాలు చేస్తున్న అధికార పార్టీ, వచ్చే నెల నుంచి జిల్లా పర్యటనలు

బీసీ సదస్సులకు సన్నాహాలు చేస్తున్న అధికార పార్టీ, వచ్చే నెల నుంచి జిల్లా పర్యటనలు

సుదీర్ఘకాలం పాటు టీడీపీని ఆదరించిన బీసీలు కొంతభాగం తొలిసారిగా 2019లో జగన్ ని బలపరిచారు. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో అది మరింత పెరిగింది. దాంతో వచ్చే ఎన్నికల్లో బీసీలను తనవైపు తిప్పుకునే యోచనలో వైఎస్సార్సీపీ ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయిలో బీసీ సదస్సుని నిర్వహించదలచినట్టు ఆ పార్టీ ప్రకటించింది. గత ఎన్నికలకు ముందు కూడా ఏలూరులో బీసీ సదస్సు నిర్వహించి డిక్లరేషన్ ప్రకటించారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఏకంగా బీసీలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి కొత్తచరిత్ర సృష్టించారు.

బీసీలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీల అమలు చేయడంలో సాధించిన పురోగతిని మరోసారి బీసీలకు తెలియజేయాలని అధికార పార్టీ నిర్ణయించుకుంది. బీసీ వర్గాలకు జరిగిన ప్రయోజనాలను అందరికీ తెలియజేసేలా రాష్ట్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు వివిధ అంశాలు చర్చించారు. బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సహా వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, బీసీ నేతలు పాల్గొన్నారు.

బీసీల ఆత్మగౌరవం కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు చేపట్టాలని నిర్ణయించినట్టు వైఎస్సార్సీపీ ప్రకటించింది. రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉంటే వారికోసం 56 కార్పోరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసినప్పటికీ వాటి ద్వారా జరిగిన మేళ్లు వివరించాలని భావిస్తున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాలు సాగుతాయంటున్నారు. తొలుత అన్ని కొత్త జిల్లాల్లో బీసీ ప్రాంతీయ సదస్సులు జరపబోతున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి అవి ప్రారంభమవుతాయి. ముగింపుగా రాష్ట్ర స్థాయిలో భారీ బీసీ సదస్సు నిర్వహించబోతున్నారు.

గడిచిన మూడేళ్లలో 31వేల కోట్ల రూపాయలను బీసీ సబ్ ప్లాన్ కోసం ప్రభుత్వం కేటాయించిన మూలంగా అన్ని బీసీ కులాలకు ఎంతో ప్రయోజనం దక్కిందని ఈ అంశాన్ని క్షేత్రస్థాయి వరకూ తీసుకెళ్లాలని సంకల్పించారు. ఈ సదస్సుల నిర్వహణ బాధ్యతను వేణు, జంగా కృష్ణమూర్తికి అప్పగించారు. బీసీలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను గుర్తించి , వాటికి పార్టీ ద్వారా పరిష్కారం నెరవేర్చేలా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయబోతున్నట్టు మంత్రి వేణు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు లబ్ది జరుగుతుంటే చంద్రబాబు సహించలేకపోతున్నారని, బీసీలను బాబు వంచిస్తే, జగన్ ఆదరించిన విషయం ప్రజలు గుర్తించారని ఆయన తెలిపారు. అందుకే రాష్ట్రంలో సమస్యలు సృష్టించి పబ్బం గడుపుకునే యత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. బీసీలలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం అధికార పార్టీ నిర్ణయం రాజకీయంగా మరింత వేడెక్కించే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి