iDreamPost

వైసీపీ నేత, సీనియర్‌ కార్పొరేటర్‌ దారుణహత్య

వైసీపీ నేత, సీనియర్‌ కార్పొరేటర్‌ దారుణహత్య

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ 9వ డివిజన్‌ కార్పొరేటర్, వైసీపీ నేత కంపర రమేష్‌ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం అర్థరాత్రి కంపర రమేష్‌ను తెలిసిన వ్యక్తులే కారుతో ఢీ కొట్టి, ఆపై కారుతో తొక్కించి చంపేశారు. పాత కక్షలు, ఆర్థికపరమైన వివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

కంపర రమేష్‌ తన స్నేహితులతో కాకినాడ రూరల్‌ వలసపాకల వద్ద గురువారం అర్థరాత్రి పార్టీ చేసుకునేందుకు వెళ్లారు. అతనికి కాకినాడ రెవెన్యూ కాలనీకి చెందిన చిన్న కాల్‌ చేసి మాట్లాడే పని ఉందని చెప్పగా.. వలసపాకల వద్దకు రావాలని రమేష్‌ చెప్పారు. చిన్న కారులో వలసపాలకకు చేరుకున్నారు. ఇరువురు కొంత సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఘర్షణ పడ్డారు. చిన్న కారుతో కంపర రమేష్‌ను ఢీ కొట్టారు. ఆ తర్వాత రమేష్‌పైకి కారును ఎక్కించారు. ముందుకు, వెనక్కి మూడు సార్లు కారును కంపర రమేష్‌పైగా పోనిచ్చారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డు అయింది. రమేష్‌ స్నేహితులు చిన్నని వారిస్తూ.. కారుకు అడ్డు పడినా.. పట్టించుకోని చిన్న ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా కంపర రమేష్‌ ప్రాణాలు కోల్పోయారు.

కంపర రమేష్‌ కాకినాడ కార్పొరేషన్‌ 9వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆమె సోదరి కూడా నగరపాలక సంస్థల్లో 4వ డివిజన్‌ కార్పొరేటర్‌గా సేవలందిస్తున్నారు. 2017లో జరిగిన కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో కంపర రమేష్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైసీపీలో చేరారు. అంతకు ముందు కూడా ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. వైసీపీకి కాకినాడ నగరంలో బలమైన నేతగా కంపర రమేష్‌ ఉన్నారు. 2017 కార్పొరేషన్‌ ఎన్నికల్లో.. బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్యపై కంపర రమేష్‌ గెలిచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి