iDreamPost

ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌ ఆసీస్ మహిళలదే

ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌ ఆసీస్ మహిళలదే

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మహిళా టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌పై ఆసీస్ 85 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఐదోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై ఐసీసీ టోర్నీ ఆరంభం నుంచి తమ అద్భుత బౌలింగ్ ప్రతిభతో భారత్‌ను అంతిమ పోరుకు చేర్చిన బౌలర్లు ఫైనల్‌లో చేతులెత్తేశారు.

ఈ ఓటమితో వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తూ తొలిసారి ఫైనల్‌కి చేరిన భారత్ ప్రపంచకప్‌ను చేజిక్కించుకోవాలనే ఆకాంక్ష ఆవిరైంది. 2010, 2012, 2014లలో హ్యాట్రిక్ గా ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న ఆసీస్ 2018 లోను ప్రపంచకప్‌ గెలుపొందింది. నేడు సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచి ఐదోసారి విశ్వవిజేతగా ఆసీస్ మహిళా జట్టు నిలిచింది.తొలుత బౌలర్ల వైఫల్యంతో ఆస్ట్రేలియాకి భారీగా 184 పరుగులు సమర్పించుకున్న టీమిండియా ఉమెన్స్ జట్టు అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటర్ల వైఫల్యంతో 19.1ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలి భారత క్రికెట్ అభిమానులకు మనోవేదన మిగిల్చింది.

పవర్ ప్లే లోనే కీలక వికెట్లు జారవిడుచుకొని లక్ష్యానికి దూరమైన భారత్:

185 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తొలి ఓవర్ మూడో బంతికే ఎదురు దెబ్బ తగిలింది. యువ సంచలన బ్యాటర్ షెఫాలీ (2) షట్‌ బౌలింగ్‌లో కీపర్‌ హీలీ చేతికి చిక్కి పెవిలియన్‌కు చేరింది.మూడో స్థానంలో బ్యాటింగుకు వచ్చిన తనియా భాటియా తలకి బంతి బలంగా తాకడంతో రెండో ఓవర్‌లోనే రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరింది.ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ పరుగుల ఖాతా తెరవకుండానే జొనాసెన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కాగా, రెండు ఫోర్లు కొట్టి ఆశలు రేపిన కూడా స్మృతి (11) వెనుదిరిగింది.ఈ దశలో బాధ్యతాయుతంగా ఆడవలసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మరోసారి తన పేలమైన బ్యాటింగ్ ఫామ్ ను కొనసాగిస్తూ జొనాసెన్‌ బౌలింగ్‌లో గార్డ్‌నర్‌ పట్టిన క్యాచ్‌తో ఔటై నిరాశపరిచింది. దీంతో భారత్‌ 5.4 ఓవర్లలోనే 30 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. లక్ష్యఛేదనలో భారత్ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు.భారత్ జట్టు 11.3 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 58 పరుగులు మాత్రమే సాధించి ఓటమికి చేరువైంది.

ఛేదనలో హర్మన్‌సేనపై ఆసీస్‌ బౌలర్లదే ఆధిపత్యం:

జట్టు కష్ట సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన వేదా కృష్ణమూర్తితో కలిసి దీప్తి శర్మ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది.కానీ వీరిద్దరూ వికెట్లు కాపాడుకుంటూ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో సాధించాల్సిన రన్‌రేటు భారీగా పెరిగిపోయింది.రన్‌రేటు పెంచే క్రమంలో దూకుడుగా ఆడి వేదా 24 బంతులలో 19 పరుగులు చేసి ఔటవ్వగా కొద్దిసేపటికే దీప్తి శర్మ కూడా 35 బంతులలో 33 పరుగులు చేసి వెనుదిరిగింది.ఆఖర్లో కాసేపు క్రీజులో నిలిచి పోరాడిన రిచ ఘోస్ 18 బంతులలో 18 పరుగులు చేసి షట్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. షట్ బౌలింగ్‌లో పూనమ్‌ యాదవ్ ఔట్ కావడంతో భారత్‌ 19.1 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో 85 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా ఆకాంక్షలు ఆవిరి కాగా మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఐదోసారి చేజిక్కించుకుంది. ఆసీస్‌ బౌలర్లలో షట్ నాలుగు వికెట్లు పడగొట్టగా జొనాసెన్‌ మూడు వికెట్లు తీసి సత్తా చాటారు.

శతక భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించిన ఆసీస్ ఓపెనర్లు:

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు.తొలి ఓవర్ నుండే భారత బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించిన ఆసీస్ ఓపెనర్లు భారత ఫీల్డర్ల తప్పిదాలతో ఔట్‌ కాకుండా తప్పించుకున్నారు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఓపెనర్లు అలిస్సా హీలీ, బెత్‌ మూనీ అర్థ సెంచరీలు సాధించారు.భారత ఫాస్ట్ బౌలర్‌ శిఖ పాండే బౌలింగ్ చేసిన 11వ ఓవర్‌లో మూడు, నాలుగు, ఐదు బంతులకు హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన హేలీ స్కోరు బోర్డుని ఉరకలెత్తించింది.ఓపెనర్ హీలీ చెలరేగి ఆడి 39 బంతులలో 4 ఫోర్లు,5 సిక్సర్లతో 75 పరుగులు చేసింది. సెంచరీ వైపు దూసుకు వెళ్తున్న హీలి, రాధా యాదవ్‌ వేసిన 12వ ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి బౌండరీ వద్ద వేదా కృష్ణమూర్తి చేతికి చిక్కి తొలి వికెట్‌గా వెనుదిరిగింది. మరో ఓపెనర్ బెత్‌ మూనీతో కలిసి తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

స్లాగ్ ఓవర్లలో బౌండరీల మోత మోగించిన బెత్‌మూనీ:

దీప్తి శర్మ బౌలింగ్‌లో కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (16) బంతిని గాలిలోకి లేపగా శిఖా పాండే పట్టిన క్యాచ్‌తో అవుట్ కాగా అదే ఓవర్‌లో గార్డ్‌నర్‌ కూడా (2) స్టంపౌటవ్వడంతో ఆసీస్‌ 156 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది.19వ ఓవర్లో పూనమ్‌ యాదవ్ రేచల్‌ హైన్స్ (4)ను బౌల్డ్‌ చేసింది. కెప్టెన్ లానింగ్ (16), గార్డనెర్ (2), హైన్స్ (4) వెనువెంటనే పెవిలియన్ బాట పట్టినప్పటికీ బెత్‌మూనీ ఆఖర్లో గేర్ మార్చి బ్యాట్ ఝళిపించి బౌండరీలు బాదింది.ఇన్నింగ్స్ చివరి వరకు బ్యాటింగ్ కొనసాగించిన బెత్‌మూనీ అజేయంగా 54 బంతులలో 10 ఫోర్లు కొట్టి 78 పరుగులు చేసింది.దీంతో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టగా పూనమ్ యాదవ్, రాధ యాదవ్ చెరొక వికెట్ తీశారు.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అలిస్సా హీలీ

ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ: బెత్‌ మూనీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి