iDreamPost

ఆర్ఆర్ఆర్ లో మార్పులు తప్పవా

ఆర్ఆర్ఆర్ లో మార్పులు తప్పవా

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికి షూటింగ్ ప్రీ క్లైమాక్స్ కు వచ్చేది. కాని ఊహించని పరిణామం ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉండటంతో రెండు నెలలకు పైగా గ్యాప్ తో తిరిగి ఎప్పుడు అనుమతులు వస్తాయా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా షూటింగ్ లో ఉన్నన్నాళ్ళు మీడియాతో అసలు ఇంటరాక్షన్ అవ్వడానికి ఇష్టపడని, టైం లేని జక్కన్న ఇప్పుడు విస్తృతంగా వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.

దాంతో పాటు ప్రస్తుత పరిస్థితి గురించి తన అనుభవాన్ని మేళవించి సలహాలు సూచనలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆర్ఆర్ఆర్ లో కొన్ని కీలక మార్పులు తప్పేలా లేవు. షూటింగ్ ఇంకా పాతిక శాతం దాకా బాలన్స్ ఉంది. అందులో విదేశీ నటీనటులు పాల్గొనాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల కళాకారులు వచ్చి చేసే సీన్లు, పనులు ఉన్నాయి. ఇప్పుడివన్నీ అంత సులభం కాదు. చాలా విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది. రాజమౌళి మాటలను బట్టి చూస్తే అది తప్పేలా లేదు. 2021 జనవరి 8 డేట్ ని వదులుకునేందుకు టీం ఇష్టపడటం లేదు. నిర్మాత దానయ్య అదే చెబుతూ వచ్చారు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ సమ్మర్ లో తప్ప అంతకు ముందు వచ్చే అవకాశం లేదని కొన్ని మీడియా వర్గాల్లో కథనాలు వచ్చాయి. ఆ స్లాట్ లో మెగాస్టార్ చిరంజీవి ఆచార్యని షెడ్యూల్ చేశారని కూడా ప్రచారం జరిగింది. అసలు ప్రభుత్వ అనుమతులు వచ్చాక కాని వీటి మీద పూర్తి స్పష్టత రాదు. ఆలోగా ఏది చెప్పినా తొందరపాటే అవుతుంది. అందుకే నిర్మాతలు సైతం తమ సినిమాల అప్ డేట్స్ గురించి ఏదీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఏవైనా మార్పులు జరిగితే క్వాలిటీలో ఏదైనా తేడా వస్తుందేమోనని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి కరోనా వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల దర్శక నిర్మాతలు పడుతున్న ఇబ్బందులు అన్నిఇన్ని కావు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి