iDreamPost

ఆరోజు స్టాలిన్‌ని పొగిడిన తమ్ముళ్ల నోర్లు ఇప్పుడు తెరుచుకోవా?

ఆరోజు స్టాలిన్‌ని పొగిడిన తమ్ముళ్ల నోర్లు ఇప్పుడు తెరుచుకోవా?

ప్రస్తుతం అందరి చూపు తమిళనాడు రాష్ట్రం వైపు పడింది. కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, చెపాక్ నియోజకవర్గ ఎమ్మెల్యే, యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కీలక వ్యాఖ్యలే. సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా, కరోనా వైరస్ లాంటిది.. వాటిని అంతమొందించినట్లే.. దీన్ని నిర్మూలించాలంటూ ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై హిందూత్వ, ధార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజెపీ నేతలు సైతం మండిపడుతున్నారు. అయితే ఉదయనిధి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు సరికదా.. తన వ్యాఖ్యలను కట్టుబడి ఉన్నట్లు రాజకీయ నేతగా మారిన నటుడు సమర్థించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఆయన తండ్రి, తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం తన కొడుకును వెనకేసుకు వచ్చాడు.

ఇదిలా ఉంటే.. ఉదయనిధి తల నరికి తీసుకువస్తే రూ. 10 కోట్లు రివార్డు ఇస్తానంటూ అయోధ్యకు చెందిన సాధువు జగద్గురు పరమహంస ఆచార్య సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఉదయనిధి తన వ్యాఖ్యలతో దేశంలోని 100 కోట్ల మంది ప్రజానీకం మనోభావాలను దెబ్బతీశారని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అన్ని డబ్బులు స్వామిజీకి ఎక్కడి నుండి వస్తున్నాయంటూ కౌంటరివ్వడంతో పాటు తాను ఎవ్వరికీ భయపడేది లేదని ఉదయనిధి అనడంతో పుండుమీద కారం చల్లినట్లు అయ్యింది. దీంతో స్వామిజీ రివార్డును రూ. 20 కోట్లకు పెంచాడు. ఉదయనిధి స్టాలిన్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ 262 మంది ప్రముఖులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు లేఖ రాశారు. మత హింసను ప్రేరేపించేలా ఆయన చేసిన విద్వేష ప్రసంగాన్ని సుమోటోగా స్వీకరించాలని కోరారు.

వాస్తవానికి కక్షపూరిత రాజకీయాలు చేయాలన్నా, రిసార్ట్ రాజకీయాలను రంగరించాలన్న తమిళనాడు పెట్టింది పేరు. గతంలో అన్నాడీఎంకె, డీఎంకే మధ్య హోరా హోరీ పోరు నడిచేది. దివంగత మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నంత రాజకీయ విద్వేషం ఉండేది. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు.. మరొకరిపై దాడులు చేయించడం పరిపాటిగా మారింది. కానీ గత ఎన్నికల్లో స్టాలిన్ గెలిచాక.. రాజకీయ పరిస్థితులు భిన్నంగా మారాయి. అన్నాడిఎంకే చేపట్టిన పలు పథకాలకు అదే పేరుతో కొనసాగించారు. జయలలిత హయాంలో తీసుకు వచ్చిన అమ్మ క్యాంటీన్లను తొలగించలేదు సరికదా.. ఆపేరుతోనే నడుపుతున్నారు. ప్రమాణ స్వీకారం సమయంలో అన్నాడీఎంకే కీలక నేతలు పన్నీర్ సెల్వం, పళనీ స్వామిలకు సముచిత స్థానం కల్పించడం దగ్గర నుండి.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం వంటి మంచి పనులు చేపట్టారు స్టాలిన్. అంతేకాకుండా స్టాలిన్ అధికారం చేపట్టే సమయానికి 65 లక్షల స్కూల్స్ బ్యాగులపై మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్ సెల్వం, జయలలిత ఫోటోలు ఉండటం.. వాటిని అలాగే పంపిణీ చేయడంతో స్టాలిన్ రూటే సెపరేటు అనుకున్నారు.

స్టాలిన్ చేపట్టిన పనులను మెచ్చుకోని వారుండరు. అయితే ఈ చర్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు ముడిపెడుతూ.. టీడీపీ చెందిన నేతలు, కార్యకర్తలు నీతులు చెప్పారు. కక్ష పూరిత చర్యలకు దిగకుండా, రాజకీయాల్లో బేషజాలకు పోకుండా స్టాలిన్ పరిపాలని చేస్తున్నారంటూ సూక్తులు వల్లించారు. ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలని, అంతేకానీ.. ప్రభుత్వం మారితే..పథకాల పేర్లు మార్చేయాల్సిన అవసరం లేదంటూ వైసీపీ చర్యలపై మండిపడ్డారు. మరీ ఇప్పుడు సనాతన ధర్మంపై ఆ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేయడం పట్ల ఇప్పుడు ఆ తెలుగు తమ్ముళ్లు నోర్లు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొడుకును వెనకేసుకు వచ్చిన స్టాలిన్ గురించి ఇప్పుడు మాట్లాడకపోవడంపై మండిపడుతున్నారు కొందరు. ఇప్పుడు వారి సంకుచిత మనస్థత్వాలు భయపడ్డాయని, కేవలం రాజకీయ లబ్ది కోసమే ఆనాడు విమర్శలు చేసిన నోళ్లు.. ఈ రోజు మూతపడటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డిని ప్రతి విషయంలో  విమర్శించే తమ్ముళ్లు.. మరీ ఇప్పుడేమైపోయారంటూ మండిపడుతున్నారు కొందరు. స్టాలిన్ ను అనేంత ధైర్యం లేకపోవడమా లేదంటే  ఏదైనా రాజకీయ కోణం ఉందా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా తెలుగు తమ్ముళ్లు స్పందిస్తారో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి