iDreamPost

బాబు – సీఐడీ ఆఫీస్‌కు వస్తారా..? కోర్టుకు వెళతారా..?

బాబు – సీఐడీ ఆఫీస్‌కు వస్తారా..? కోర్టుకు వెళతారా..?

అమరావతి రాజధానిలో అసైన్మెంట్‌ భూములు కొన్న వారికి మేలు చేస్తూ నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు, నాటి మంత్రి పి.నారాయణలకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ సమయంలోనే అనేక నాటకీయ పరిణామాలు చేటుచేసుకున్నాయి. నోటీసులు అందజేసేందుకు అధికారులు దాదాపు మూడు గంటల సమయం తీసుకున్నారు. ఉదయం 8 గంటలకు చంద్రబాబు ఇంట్లోకి వెళ్లిన అధికారులు.. 11 గంటలకు బయటకు వచ్చారు. నోటీసులు తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించారా..? అంత సమయం ఎందుకు పట్టింది..? చివరకు నోటీసులు ఏ పరిస్థితిలో తీసుకున్నారు..? అనే ప్రశ్నలు ప్రజల్లో మెదిలాయి.

చంద్రబాబు నోటీసులైతే అందుకున్నారు కానీ ఆయన సీఐడీ ముందకు వచ్చి వివరణ ఇస్తారా..? అనేది ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న సందేహం. తనపై ఏ కేసు నమోదైనా.. కోర్టులకు వెళ్లి విచారణలను ఆపించుకోవడం, ఏళ్ల తరబడి ఆయా కేసులపై స్టేలు కొనసాగించుకోవడం చంద్రబాబుకు ఉన్న అలవాటు. అవినీతి, అక్రమాల కేసుల్లో ఇప్పటి వరకు చంద్రబాబు విచారణ ఎదుర్కొన్న సందర్భం లేదు. ఉమ్మడి రాజధానిలో చోటు చేసుకున్న ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు కోర్టులను ఆశ్రయించారు.

Also Read : అమరావతి భూముల కేసు – చంద్రబాబు ఇంటికి సిఐడి

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేండింగ్‌ జరగలేదని, ఏ విచారణకైనా సిద్దమని, విచారణ జరిపి చర్యలు తీసుకోమని సవాళ్లు విసిరిన చంద్రబాబు… తీరా ప్రభుత్వం విచారణ మొదలు పెట్టాక.. తన పార్టీ నేత వర్ల రామయ్య ద్వారా కోర్టులో పిటిషన్లు దాఖలు చేయించారు. ఏపీ హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జేకె మహేశ్వరి అమరావతిపై జరుగుతున్న అన్ని విచారణలపై స్టే విధించారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

విచారణలకు సిద్దమని సవాళ్లు చేయడం, ఆ తర్వాత విచారణలను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లడం, అక్కడ తన మనుషుల ద్వారా స్టేలు వచ్చేలా మంతనాలు జరపడం.. ఇంత వరకూ చంద్రబాబు అనుసరించిన వైఖరి ఇది. ఇలాంటి చరిత్ర ఉన్న చంద్రబాబు.. ఈ నెల 23వ తేదీన సీఐడీ విచారణకు హాజరవుతారా..? వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారా..? అంటే సందేహమే.

సీఐడీ నోటీసులు అందుకున్న మరు నిమిషమే.. చంద్రబాబు న్యాయవాదులతో మంతనాలు ప్రారంభించారు. సీఐడీ నోటీసులపై ఎలా స్పందించాలన్న దానిపై చర్చిస్తున్నారు. నోటీసులకు సమాధానాలు చెప్పాలా…? లేక కోర్టులకు వెళ్లి విచారణను ఆపాలని కోరాలా..? అనే అంశాలపై చంద్రబాబు న్యాయనిపుణులతో చర్చిస్తుండడం ఆయన గత చరిత్రను గుర్తు చేస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యే సూచనలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. చంద్రబాబు కోర్టులకు వెళితే అందులో ఆశ్చర్యం ఏమి ఉండదు.. కానీ సీఐడీ విచారణకు హాజరైతే అదో పెద్ద వింత అవుతుంది. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Also Read : ఏమిటీ అసైన్మెంట్‌ భూముల కేసు..? సీఎంగా చంద్రబాబు నేరం ఎలా చేశారు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి