iDreamPost

అశోక్ న్యాయ పోరాటం చేస్తారా??

అశోక్ న్యాయ పోరాటం చేస్తారా??

తనకు కనీసం ఒక నోటీసైనా ఇవ్వకుండా మాట మాత్రం చెప్పకుండా మాన్సాస్ ట్రస్ట్ నుంచి, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ నుంచి రాత్రికిరాత్రి తొలగించి కొత్తవారిని నియమించడం విజయనగరం రాజ వంశీకుడు అశోక్ గజపతి రాజును షాక్ కు గురిచేసింది. అసలేం జరిగిందన్నది ఆయనకు తెలిసేసరికే ఆయన మాజీ అయిపోయారు. తన తాతతండ్రులు ఏర్పాటు చేసిన సంస్థల నుంచి అకస్మాత్తుగా గెంటివేయబడడం ఆయన్ను తీవ్రంగా అవమానపరిచింది. దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తాను అంటున్నారు.

ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతూ ప్రభుత్వం అన్య మతస్థులను , అసలు ఈ సంస్థతో సంబంధం లేనివారిని ట్రస్ట్ లో చేర్చడం ఏమిటని ప్రశ్నించారు. అయితే గత టిడిపి హయాంలో జీవో నంబరు 139 ద్వారా 2016లో టిడిపికి , ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి నమ్మకస్తులైన కుటుంబరావు ఇంకా ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ మాజీ విసి డాక్టర్ ఐవి రావులను ఇదే ట్రస్ట్ లో నియమించినపుడు వారు పూర్తిగా బయటి వారని, ఈ సంస్థతో ఎలాంటి సంబంధం లేనివారన్న విషయం గుర్తుకు రాకపోవడం గమనార్హం. ఆనాడు దీనిపై కిమ్మనని అశోక్ ఇప్పుడు తన అన్న కూతురుని ట్రస్ట్ బాధ్యురాలిగా చేసినపుడు రూల్స్ మాట్లాడడం విస్తుగొలుపుతోంది. సంచయిత గజపతి ని అన్యమతస్తురాలిగా ఈయన ఆరోపిస్తున్నా ఆమె ఏనాడూ క్రిస్టియన్ మతాన్ని పాటించలేదని, తన తల్లిదండ్రులు ఇద్దరు హిందువులేనని, తాను కూడా అదే పద్ధతుల్లో ఉన్నానని చెప్పడం ద్వారా అశోక్ ఆరోపణల్లో నిజం లేదని తెలుస్తోంది.

మాన్సాస్‌ ట్రస్ట్‌ పరిధిలో 105 ఆలయాలు ఉన్నాయని వెల్లడించారు. ట్రస్ట్‌, దేవాదాయ భూములపై ప్రభుత్వం కన్నేసిందని ఆరోపించారు. దాతల భూములు ఆలయాలకే చెందాలని అశోక్‌ గజపతిరాజు డిమాండ్ చేశారు.

ట్రస్ట్‌ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని అశోక్‌ గజపతిరాజు హితవు పలికారు. ఆలయాల వ్యవహారాల్లో రాజకీయాలు చేయొద్దని సూచించారు. మాన్సాస్‌ చైర్మన్‌ పదవి మార్పు వింతగా ఉందన్నారు. భక్తుల నమ్మకాలపై దెబ్బకొట్టారని ధ్వజమెత్తారు. వంశపారంపర్య పదవుల్లో, ట్రస్టుల్లో అన్యమతస్తుల జోక్యం సరికాదని పేర్కొన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో దేవాదాయ శాఖ అధికారులతోనే… నిర్వీర్యం చేయడానికి కొన్నాళ్లుగా ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు మారినా… ఇలాంటి సమస్యలు రాలేదని వాపోయారు. రాజకీయాలతో సంబంధంలేని సంస్థకు రాజకీయాలు ఆపాదించడం దేశానికి అరిష్టమని తెలిపారు. తనకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పదవి నుంచి తొలగించారన్నారు. జీవో కాపీ అందిన తర్వాత కోర్టును ఆశ్రయించాలా?… ఏ విధమైన పోరాటం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నా ఈ విషయంలో ఆయన కాన్ఫిడెంట్ గా లేకపోవడాన్ని సమాజం, మీడియా గుర్తించింది. దానికితోడు కుటుంబరావు ఆ ట్రస్ట్ లో చేరిన తరువాత అక్రమాలు జరిగాయన్నది ఇప్పుడు వెలుగులోకి వస్తోంది…నిజానిజాలు మరింత లోతైన దర్యాప్తులో వెలుగు చేస్తాయని విజయనగరం ప్రజల భావన.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి